తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి .. పాత సామెత అయినా.. కొత్త రాజకీయాలకు సరిగ్గా నప్పుతుందనాలి. తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి పాఠ్యపుస్తకంలో మాజీ సీఎం, నటుడు నందమూరి తారకరావు జీవితచరిత్రను కొత్తగా ముద్రించింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీను స్థాపించిన ఎన్టీఆర్ అంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టం కూడా. అదే అభిమానంతో తన కుమారుడుకు తారకరామారావు నామకరణం చేసినట్టు పలుమార్లు చెప్పేవారు కేసీఆర్. ఇప్పుడు ఆ అభిమానం చాటుకున్నారా. భవిష్యత్ రాజకీయాలకు నిచ్చెనగా ఎన్టీఆర్ పేరును ఇలా తెరమీదకు తెచ్చారా! అనేది పక్కనబెడితే.. టీఆర్ ఎస్‌కు ఇది లాభం చేకూర్చే అంశం. కేసీఆర్ నిర్ణయం.. ఇప్పుడు జగన్ ముందు సవాల్‌గా మారింది. అదెలా అంటారా.. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఎన్నో హామీలు గుప్పిచ్చారు. నవరత్నాలతోపాటు.. కుల, మత ప్రాతిపదికన ఓట్ల కోసం చాలా చెప్పారు.
వాటిలో కృష్ణాజిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెడతానని కూడా హామి ఇచ్చారన్నమాట. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు.. కడపకు వైఎస్సార్ జిల్లా.. ఇదే మాదిరిగా కృష్ణాకు ఎన్టీఆర్, గోదావరి జిల్లాల్లో ఒకదానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామనేది జగన్ హామీ. ఇద్దరూ గొప్ప వ్యక్తులే.. కానీ కులాల కుమ్ములాటలో ఎన్టీఆర్ పేరు కృష్ణాజిల్లాకు పెడితే.. ఎలా అంటూ వ్యతిరేకిస్తున్నవారున్నారు. కృష్ణాకు వంగవీటి రంగా పేరు ఉండాలంటూ కాపునాడు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. ఇద్దరూ కృష్ణాజిల్లకు చెందినవారే కావటం.. రాజకీయం, సామాజికవర్గంతో ముడిపడటంతో సున్నితమైన అంశంగా మారింది. గోదావరితో ఉండే అనుబంధాన్ని ప్రాణంతో సమానంగా భావించే గోదారోళ్లు కూడా దీనికి విముఖత వ్యక్తంచేస్తున్నారు. అయితే.. జిల్లాల పెంపుతో కొత్తగా వచ్చే జిల్లాలకు మహనీయులు, రాజకీయ నేతల పేర్లు ఉంచాలనే దానిపై ఆల్రెడీ జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఏమైనా.. తెలంగాణలో కులాల కుమ్ములాటలు పెద్దగా లేకపోయినా.. ఏపీలో మాత్రం అవే రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయనేది అక్షరసత్యం. మరి.. దీన్ని జగన్ మోహన్‌రెడ్డి ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిదాయకం.