కేరళ అద్భుతమైన రాష్ట్రం. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ప్రభుత్వానికి తోడ్పాటును అందించటంలో కేరళీయుల ప్రత్యేకత వేరు. భారత్‌లో కరోనా తొలికేసు నమోదైంది కూడా కేరళలోనే. కానీ.. ఆ తరువాత చాలా అప్రమత్తతగా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకున్నారు. సర్కార్‌కు సహకరించారు. అంత వరకూ బాగానే ఉంది.. మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో కేరళ హడలెత్తుతోంది. దీనికి కారణం.. తాజాగా జరుపుకున్న సంప్రదాయ ఓనం పండుగే కారణమంటున్నారు. చైనా అంటించిన వైరస్ ప్రపంచానికి సవాల్ విసిరేందుకు కారణం కూడా ఇటువంటి వేడుకే.. జనవరి మొదటి తారీఖు. కొత్త సంవత్సరం వేడుకల్లో గడపాలనే ఉబలాటంతో చైనా కంపెనీల్లో పనిచేసే విదేశీయులతంతా స్వదేశాలకు చేరారు. ఫలితంగా వేగంగా కొవిడ్19 పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికి వైరస్ సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో రాబోయే మూడు నెలలు చాలా క్రూషియల్ అంటూ వైద్యశాఖ హెచ్చరిస్తుంది.
అక్టోబరు నుంచి జనవరి వరకూ చాలా కీలకం.. శీతాకాలం.. పండుగలు రెండూ ఒకేసారి రావటం గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 75 లక్షల కరోనా కేసులున్నాయి. మరణాల శాతం 2 మించకపోవటం సంతోషించదగిన పరిణామం. కానీ.. శీతాకాలం వచ్చే దసరా, దీపావళి, క్రిస్‌మస్, సంక్రాంతి పండుగల్లో జనం ఒకేచోట భారీగా గుమికూడతారు. సంప్రదాయ వేడుకలు కావటంతో అందరూ కలసి పండుగ జరుపుకోవటాన్ని ఇష్టపడుతుంటారు. కేరళలోనూ ఓనం వేడుక ఇంతగా సంబరం పంచింది. వెనువెంటనే వైరస్ ఒళ్లువిరచుకుని జనాలపై పడింది. ఇప్పుడు అక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తే మినహా బయటపడలేమనేంత భయం నెలకొంది. రాబోయే పండుగలు పెద్ద ఉత్సవాలే. వీటి కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తుంటారు.
వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లకు ఇదే అనువైన సమయం. కొత్త బండి కొనాలన్నా.. ఇల్లు కట్టుకోవాలన్నా.. వ్యాపారం ప్రారంభించేందుకు విజయదశమిని ఎంచుకుంటారు. ఇప్పుడు.. ఇవన్నీ హుష్‌కాకి అనుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు. ఏపీ, తెలంగాణ వైద్యశాఖలు ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశాయి. పండుగల వేళ వైరస్ విస్తరిస్తుందని హెచ్చరించారు.
ఏ మాత్రం అలక్ష్యం చేసినా పెను విపత్తు తప్పదంటున్నారు. దీన్ని అధిగమించగలిగితే.. రాబోయే ఫిబ్రవరి నాటికి మహమ్మారి నుంచి బయటపడతామంటూ సూచిస్తున్నాయి. మరి.. దీన్ని ప్రజలు ఎంత వరకూ ఆచరించాలనేది నిర్ణయించుకోవాలి. ప్రభుత్వాలకు సహకరించటం ద్వారా వైరస్‌ను అడ్డుకోవటం చాలా సులువు అనేది తెలుస్తోంది. ఓనం పండుగ నుంచి పాఠాలు నేర్వకుండా రాబోయే పండుగల్లో తాము కూడా అలాగే ఉంటామంటే. భారీ మూల్యం తప్పదంటున్నారు.