గణనాథుడు.. ముల్లోకాలు చుట్టిరావాలని పోటీపెడితే.. అమ్మనాన్నలను మించిన దైవం ఎక్కడ ఉంటుందంటూ పార్వతీపరమేశ్వరుల చుట్టు తిరిగి కన్నవారి గొప్పతనం చాటిన గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు. నిజమే.. హిందూ సంప్రదాయ పండుగల్లో గొప్ప తత్వం దాగి ఉంటుంది. మంచి, చెడును.. ఆరోగ్యం, ఆనారోగ్యం.. తప్పొప్పులను చూపుతూ దిశానిర్దేశం చేసే నీతి దాగుంది. కాస్త మనసుపెట్టి గమనిస్తే.. పండుగల పరమార్ధం కనిపిస్తుంది. వినాయకచవితి.. తొమ్మిదిరోజుల పాటు.. కొండత దేవుడి విగ్రహాన్ని మండపంలో కొలువుదీర్చి పండుగ చేసుకుంటాం. వీధికో వినాయకుడు వెలుస్తాడు. ఈ సారి కరోనా వల్ల విగ్రహం ఏర్పాటు చేయలేకపోయినా.. చవితి పండుగ ఔచిత్యం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మట్టిప్రతిమ.. రకరకాల పత్రిలు.. కుడుములు.. బొబ్బట్లు.. వ్రత కథ. ఇవన్నీ మనకు జీవనపాఠాలు కూడా.. బంకమట్టితో చేసే విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తాం. అన్ని రకాల పత్రి కూడా అందులో ఉంటాయి. పూజలు అందుకున్న 9 రోజులు.. పత్రిలో దాగిన ఆయుర్వేద గుణాలు ఆరోగ్యాన్నిస్తాయి. నీటిలో కలిపాక.. కలుషితమైన నీటికి శుద్ధి చేస్తాయి. ఇలా.. మానసిక.. శారీరక శుద్ధి పూజలో దాగుంది. పూజలో గణపతికి ఉంచే నైవేద్యం కూడా పూర్తిగా ఆవిరితో తయారు చేసేవే. ఈ సీజన్‌లో నూనె పదార్ధాలకు ఎంత దూరంగా ఉండాలనే ఆరోగ్య సూత్రం దాగుంది. తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ వినాలి అనేది వినాయకుడి రూపంలోని అంతరార్ధం. ఇంతటి పాఠం నేర్పిన లంబోధరుడు.. తన శక్తితో కరోనా కష్టం నుంచి బయటపడేయాలని లోకం కోరుకుంటోంది.ఖైరతాబాద్ గణపతికి ప్రపంచఖ్యాతి.. ఈ సారి కరోనా నేపథ్యంలో www.ganapathideva.org వెబ్‌సైట్ ద్వారా విఘ్ననాథుడుని దర్శించుకోవచ్చు. తాపేశ్వరం నుంచి 100 కిలోల లడ్డును అందజేసినట్టు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తెలిపారు. 22.08.20 నుంచి 1.09.20 వరకూ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ వెబ్‌సైట్‌లో అలనాటి విగ్రహాలను కూడా కనులారా చూడవచ్చు.