కొడాలి నాని ఫైర్‌బ్రాండ్‌లకే బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించారు. మంత్రి పదవి చేపట్టాక మరింత చెలరేగుతున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు , బోండా ఉమా, బుద్దా వెంకన్న నోటి నుంచే పరమ పవిత్రమైన పదాలకు ప్రత్యర్థులు బాప్‌రే అనుకునేవాళ్లు. ఆ తరువాత రోజా.. ఇద్దరినీ మించేలా కొడాలి బూతుల పంచాంగం.. విప్పుతుంటే చెవులు మూసుకోవాల్సి వస్తోందట. టీవీ ఛానళ్లు చూసే ప్రేక్షకులైతే.. పిల్లలను దగ్గరగా కూర్చోబెట్టుకోవటం కూడా మానేశారట. అసలే ఇంగ్లిషు మీడియం చదువులు కావటంతో కొడాలి నోటెంట వచ్చే బూతులకు పిల్లలు అర్ధాలు కూడా అడుగుతున్నారట. ఏమైనా బీఫ్ శబ్దాలు మరీమరీ వేయలేక.. టీవీ ఛానళ్లు వాళ్లు కూడా తెగ ఇబ్బంది పడుతున్నారట. ఎందుకు సార్.. అలా మాట్లాడాతరంటే నేనింతే.. మారనంతే అంటూ చెప్పటంతో ఎవ్వరూ కూడా ఆయనకు సలహా ఇచ్చే సాహసం కూడా చేయట్లేదట. వైసీపీ అంటే.. బాబోయ్ అంటూ కమ్మసామాజికవర్గం భయపడుతుంది. పైగా అప్పట్లో టీడీపీ కేవలం కమ్మవర్గంలోని అధికారులకే కీలక పోస్టులు ఇచ్చారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి వచ్చాక.. చింతమనేని పై కేసులు బయటకు తీసి ఊచలు లెక్కబెట్టేలా చేశారు. యరపతినేని, దేవినేని ఇలా అందరినీ కదుపుతున్నారు.
నాటి డీజీపీ ఏబీవెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారి జాస్తి కిషోర్ ఇద్దరూ వైసీపీ భారిన పడ్డవారే. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా రాత్రికిరాత్రే తొలగిస్తే.. కోర్టుల చుట్టూ తిరిగి పదవి సంపాదించాల్సి వచ్చింది. అయినా కొడాలి నాని మాత్రం.. నా దారి.. జగన్ వైపేనంటూ ఫిక్స్ అయ్యారు. పైగా తాజాగా మూడు రాజధానులపై తాను సానుకూలమంటూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పెట్టించారు. ఇప్పటికే వైసీపీ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్వయంగా అమరావతి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. మిగిలిన ఎమ్మెల్యేలు చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే తాను రాజీనామా చేస్తానంటూ ఆ నాడు ఎన్నికల్లోనూ ప్రతినబూనారు. ఇప్పుడు ఏం మాత్రం నోరు జారినా కుర్చీకు ఇబ్బందని సైలెంట్ అయ్యారు. కొడాలి మాత్రం.. జగన్‌కు నా అభిప్రాయం చెప్పానంటూ స్పష్టంచేయటమే కాదు.. చంద్రబాబునాయుడును తాను ఎప్పటికీ తిడుతూనే ఉంటానంటున్నాడు. మరి.. ఈ ఇద్దరికీ ఏ విషయంలో చెడిందనేది మాత్రం.. బాబైనా చెప్పాలి.. ఏదోరోజు కొడాలైనా గుట్టు విప్పాలి.