కృష్ణాజిల్లా రాజకీయాల్లో గుడివాడ ఎప్పటికీ ప్రత్యేకతే. ఆ నాడు నందమూరి తారకరామారావు పోటీ చేసిన నియోజకవర్గం. అటువంటి చోట నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరావు. ప్రస్తుతం మంత్రిగా పనితీరు ఎలా ఉన్నా తనదైన బూతుల దండకంతో హాట్‌టాపిక్‌లో ఉండటం అయనకే చెల్లింది. జగన్‌కు తాను ఎంత చెబితే అంత అనేంతగా పాగా వేశారు. అందుకే.. దుర్గమ్మ గుడిలో సింహపు బొమ్మలు పోయినా… తిరుమల దర్శనం ఎవరు చేసుకుంటే ఏమిటంటూ సంప్రదాయవాదులను నిలదీసేంతగా ఎదిగారు. ఈయన స్నేహితుడు గన్నవరం వైసీపీ నేత, కేడీసీసీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు. 2019 ఎన్నికలకు ముందు ప్రవాస భారతీయుడుగా వ్యాపారం చేసుకునే ఆయన్ను గన్నవరం తరలించి వైసీపీ కండువా కప్పించిన నేత కొడాలి నాని. ఆ నాడు ఎన్నికల్లోనూ అన్నీ తానై యార్లగడ్డను నడిపించాడు. అయితే ఆ ఎన్నికల్లో యార్లగడ్డ ఓటమి… వల్లభనేని గెలుపుతో సీన్ మారిపోయింది. అయినా గన్నవరంలోనే ఉంటూ యార్లగడ్డ తానే ఎమ్మెల్యేగా చక్రం తిప్పటం ప్రారంభించారు. ఇది రుచించని వంశీ కాస్త ఇబ్బందికి గురయ్యాడు. మిత్రుడు పరిస్థితి చూసిన కొడాలి.. వల్లభనేనిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి.. ఇక నుంచి వంశీ మనోడేనంటూ సర్దుబాటు చేశారు.
దీంతో గన్నవరంలో రాజకీయం గరంగరంగా మారింది. ఏడాది క్రితం ఎన్నికల్లో ఎదురుబడి విమర్శించిన వల్లభనేని తనకు తెలియకుండా తన పార్టీలో కీలకంగా మారటాన్ని యార్లగడ్డ జీర్ణించుకోలేకపోయాడు. వంశీను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన కొడాలిపై అలకబూనాడు. గన్నవరం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా.. ఏదో విధంగా పార్టీ పెద్దలు జోక్యంతో కేడీసీసీ
ఛైర్మన్ పదవి కట్టబెట్టి అలకపాన్ను దింపారు. కానీ యార్లగడ్డలో కొడాలి పట్ల వ్యతిరేకత దూరంకాలేదు. మంచిమిత్రులు కాస్తా.. ప్రత్యర్థులుగా మారి. ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారట. ఇది ఎంతగా చేరిందంటే.. మొన్న గుడివాడలో కొడాలి ఎడ్లపోటీ పెడితే కానూరులో యార్లగడ్డ కూడా ఎడ్లపోటీతో ఢీ కొట్టారు. ఇలా.. ఇప్పుడు వీరిద్దరి వైరం.. కృష్ణా జిల్లాలోనే కాదట.. అటు కమ్మవర్గంలో.. ఇటు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారిందట. మళ్లీ ఈ ఇద్దరి చేతులు కలిపి.. స్నేహమేరా జీవితం అంటూ సాగేలా కమ్మ సామాజికవర్గానికి చెందిన పెద్దలు మధ్యవర్తులుగా రాజీకుదిర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట.