దుబ్బాక ఫలితం.. రాజకీయ పార్టీలను కొత్త ఆలోచనలోకి నెట్టేసింది. అప్పటి వరకూ వేసుకున్న లెక్కలు తారుమారు కావటంతో కొత్త ఎత్తులతో సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నికలు పూర్తయ్యాక.. బిహార్ లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించాక అంచనాలు మారాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. గ్రేటర్ దంగల్.. కమలం.. కారు నువ్వానేనా అనేట్టుగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే కేటీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 లోపు డివిజన్లను సొంతం చేసుకునే సత్తా టీఆర్ ఎస్‌కు ఉందని పిలుపునిచ్చారు. తన సొంతసర్వేలో తేలిన విషయాలను సూటిగానే ప్రస్తావించారు. పైగా.. 21 మంది టీఆర్ ఎస్ కార్పోరేటర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. దీంతో ఆ 21 మందిని మార్చే అవకాశాలున్నాయని అభిప్రాయం బలపడింది. దీంతో ఎవరికి వారే.. తమ తప్పులను బేరీజు వేసుకునే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్టోబరులో కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ భారీగా నష్టపోయింది. 2000 కాలనీలు నీటిలో వారం పదిరోజులు ఉండిపోయాయి. ఆ సమయంలో అండగా నిలవాల్సిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ముఖం చాటేయటం కూడా టీఆర్ ఎస్‌ను ఇబ్బందికి గురిచేసింది.
ఇక్కడే టీఆర్ ఎస్ వరదను అనకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. సుమారు రూ.500 కోట్ల విడుదల చేసి వరద బాధితులకు అందజేసేందుకు సిద్ధమైంది. అయితే.. ఆ విషయంలో రాజకీయనేతలు జోక్యం పెరగటంతో అబాసు పాలైనంత పనైంది. బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 ప్రకటించి అందజేశారు. అయితే.. వాటిలో కేవలం 2000-3000 మాత్రమే
బాధితులకు చేరాయి. మిగిలిన సొమ్మంతా పక్కదారి పట్టడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టయింది. దాన్నుంచి బయట పడేందుకు స్వయంగా బాధితులకే నష్టపరిహారం అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే టీఆర్ ఎస్ సర్కారుకు కొత్త సవాల్ ఎదురైంది. పరిహారం అందని వారి నుంచి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. లోకల్ కార్పొరేటర్లపై దాడి చేసేంత వరకూ దారితీసింది. ఇటువంటి వ్యతిరేకత ఉన్న వేళ.. దుబ్బాకలో టీఆర్ ఎస్ ఓటమి మూలిగేవాని నెత్తిన తాడిపండు పడినట్టుగా మారింది. ఈ సదవకాశాన్ని బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూలంగా మలచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా.. తాము ఏకంగా 75 డివిజన్లు గెలుస్తామంటున్నారు. ఎవరి లెక్కలు నిజమవుతాయో.. ఎవరి ఆశలు నిజమవుతాయో అనేది కాలమే నిర్ణయించాలి.