ఉన్నది ఉన్నట్టుగా.. కుండబద్దలు కొట్టగల నటి పసుపులేటి మాదవీలత. బీజేపీ నాయకురాలు కూడా. ఇటీవల ఏపీలో వరుసగా జరుగుతున్న దేవాలయాలపై దాడులను ఆమె ఖండించారు. దాడులకు దిగుతున్న వారిని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా హిందువులు ఏకతాటిపైకి రావాలంటూ కోరుతున్నారు. ఇది తాను బీజేపీలో ఉండటం వల్ల మాత్రమే కాదు.. హిందువుగా తన బాధ్యత అంటారామె. కానీ.. సోషల్ మీడియాలో మాదవీలతను టార్గెట్ చేస్తూ ఓ వర్గం రెచ్చిపోవటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు మాదవీలత. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కామెంట్స్ చేస్తున్నవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్స్ చేసిన వాళ్లను ఠాణాకు తీసుకొచ్చి చితకబాదాలంటున్నారు. చర్యలు తీసుకోని పక్షంలో తానే దీక్షకు దిగుతానంటూ హెచ్చరించారు.
నిజమే.. మాదవీలత మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. సినీ ఇండస్ట్రీలోని పలు అంశాలపై కూడా ఆమె ఇదే తరహాలో మాట్లాడారు. ఇప్పుడు హిందు దేవాలయపై దాడులపై తాను ఆందోళన తెలియజేయటాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారంటున్నారు. తనకు కానీ.. తుపాకీ లైసెన్స్ వుంటే వాళ్లను కాల్చి పారేస్తాననేంతగా ఆగ్రహం వెలిబుచ్చారు. తనపై కొన్ని కుల సంఘాలు కూడా మాటల దాడికి దిగుతున్నాయంటూ ఆవేదన చెందారు. కొందరు తనకు శ్రద్ధాంజలి కూడా ఘటించాలరన్నారు. ఏమైనా మాదవీలత పట్ల ఇంత పచ్చిగా కామెంట్స్ చేస్తున్నవారు ఏపీకు చెందిన ఓ ప్రధాన పార్టీ అనుచరులు, అభిమానులు కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందనేది ఆసక్తిగా మారింది. మాదవీలతకు న్యాయం జరుగుతుందా.. ఆమె దీక్షకు కూర్చొనే అవకాశం వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.