మెగాస్టార్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. భారీవర్షాలు, వరదలతో అలమటిస్తున్న బాధితులకు తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎం రిలీఫ్‌పండ్)కు సినీ నటుడు చిరంజీవి రూ.కోటి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. గడచిన వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలమైంది. అపారప్రాణ నష్టంతోపాటు , వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడుతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత వరకు వాళ్లను సాయం చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానంటూ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దన్నయ్య. అభిమానులకు అన్నయ్య. కోట్లాది మంది అభిమానులు చిరు పిలుపుతో రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు.
ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ తానిచ్చే పిలుపుతో స్పందిస్తున్నారు. కేవలం సినిమాలు చూసి.. ఈలలు వేయటమే కాదు.. మెగా అభిమానులంటే.. సమాజసేవలో ముందు వరుసలో ఉంటారని నిరూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి పిలుపుతో మెగాకుటుంబ అభిమానులు సేవ కోసం కదలుతున్నారు. ఇప్పటికే వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏపీ తెలంగాణల్లో జనసేన కార్యకర్తలు, చిరు అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వీలైనంత వరకూ నిధులు సేకరించి ప్రభుత్వానికి అందజేయటం.. వీలైతే బాధితులకు కొంతమేర ఆర్ధిక సాయం అందించేందుకు సమాయత్త మవుతున్నారు. చిరంజీవి మొదటి నుంచి మదర్‌థెరిస్సా స్పూర్తితోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెబుతుంటారు. ప్రకృతి విపత్తులు, అనావృష్టి, కరోనా వంటి క్లిష్టమైన సమయాల్లోనూ ముందు వరుసలో ఉండి.. సేవకు పిలుపునిస్తున్నారు. ముందుగా తానే స్పందించి.. అభిమానుల్లో స్పూర్తి నింపుతున్నారు. మాటలు కాదు.. చేతల్లోనూ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు.



