సత్యదేవ్.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న నటుడు. కొన్ని సినిమాలే చేసినా తనంటే ఏమిటో నిరూపించుకున్నాడు. విశాఖపట్టణం జిల్లా నుంచి వచ్చిన యువ నటుడు మాంచి ఈజ్‌తో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్నాడు. హీరోగా ఇంత పాపులారిటీ సాధించేందుకుకారణం.. మెగాస్టార్ చిరంజీవి అంటాడు. పసితనం నుంచి చిరు సినిమాలు చూడటమే కాదు.. ఇమిటేట్ చేస్తూ.. తెలియకుండానే వీరాభిమానిగా మారానంటారు. చిన్నపుడు.. తాను చిరంజీవి సినిమా పాటలు వినిపిస్తే తప్ప అన్నం తినేవాడిని కాదంటూ ఇంట్లో వాళ్లు చెబుతుంటారని గుర్తుచేశారు. అంతేనా.. మెగాస్టార్ సూపర్‌మూవీ కొదమసింహం సినిమాలో తాడు పట్టుకుని కొండ మీద నుంచి మరో కొండ మీదకు దూకే సీన్‌ను తాను కూడా ఇంట్లో చేశాడట. అంతే.. తీగలు తెగి.. పక్కనే ఉన్న బల్లమీద పడటంతో తలకు పెద్ద గాయమైందట. అంతే.. ఆసుపత్రికి తీసుకెళితే ఆ డాక్టర్ కుట్లు వేసేందుకు తుప్పుపట్టిన కత్తెర వాడారట. దీంతో అది సెప్టిక్ కావటం.. నుదురు మీద మచ్చగా మారటం అన్నీ చిరంజీవి అంటే తనకు ఎంత పిచ్చి అనేందుకు ఉదాహరణ అంటారు సత్యదేవ్.
బుద్దిగా చదువుకుని ఉద్యోగం చేసుకునే తనలో ఏదోమూలన నటుడు కావాలనే కోరిక ఉండేదట. అంతే.. ఐశ్వర్యారాయ్ కావాలంటే ముంబై వెళ్లాలనే డైలాగ్‌ను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేశారట. అయితే.. మొదట సినిమా ఆడిషన్‌లోనే నీ ముఖం సినిమాకు పనికి వస్తుందా అనే విమర్శ ఎదురైందట.. అలా విమర్శించిన వ్యక్తే తనకు సినిమా ఛాన్స్ ఇచ్చారంటారు. అలా.. మిస్టర్‌ఫర్‌ఫెక్ట్, అత్తారింటికి దారేది, వంటి సినిమాల్లో చిన్న కేరక్టర్‌తో తెరంగేట్రం చేసినా.. జ్యోతిలక్ష్మి సినిమాలో హీరో అవకాశం రావటంతో రాత్రికి రాత్రే ఇమేజ్ హీరోగా మారాడు. బ్లఫ్‌మాస్టర్ గా సత్యదేవ్ విశ్వరూపం చూపాడనే చెప్పాలి. తన కళ్లు చాలాబావుంటాయంటూ పూరీజగన్నాథ్ ప్రశంస చాలా ఆనందాన్ని పంచిందంటారు.
ఇవన్నీ పక్కనబెడితే.. పూరీ పుణ్యామంటూ ఒకసారి తన హీరో మెగాస్టార్‌ను కలవటం మరచిపోలేనిదంటారు. చిరంజీవి నోటి నుంచి జ్యోతిలక్ష్మి ట్రైలర్ చూశానంటూ రావటం మరింత సంతోషంగా అనిపించిందంటారు సత్యదేవ్. చిన్నప్పటి నుంచి ఆరాధించే చిరంజీవిని దగ్గరగా చూడటం.. షేక్‌హ్యాండ్ ఇవ్వటం ఇవన్నీ అద్భుతమైన భావనను కలిగించాయంటారు. ఆయన చుట్టూ ఏదో తెలియన పవర్ ఉందటూ సత్యదేవ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అంతేనా.. భవిష్యత్ లో మంచి నటుడుగా నిరూపించుకుని జాతీయస్థాయి అవార్డు సాధించాలన్నదే లక్ష్యమంటూ చెప్పుకొచ్చాడు.