కైలాసాన శివుడు నర్తించినట్టు.. గోవులు కాసే యాదవుడు మాధవుడుగా మెరిసినట్టు.. ఆపదలో ఉన్న వారిని కాసేందేకు వచ్చిన ఆపద్బాందవుడు తానైనట్టుగా.. చిరంజీవి నటన.. నాట్యానికి నిలువుటద్దం ఆపద్బాందవుడు. మాదవ్‌గా మెగాస్టార్ లో దాగిన గొప్పనటుడు ప్రేక్షకులకు కనిపిస్తాడు. అమాయకంగా కనిపిస్తూ.. కంటతడిపెట్టిస్తాడు. వాస్తవానికి చిరంజీవి అనగానే మాస్. ఊరమాస్. ఫైట్లు.. పాటలు.. అంతకుమించిన డ్యూయెట్లు ఇన్ని ఊహించుకుని వచ్చిన సగటు మెగా అభిమానికి ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. కానీ.. పాటలు.. ఇప్పుడు విన్నా మనసంతా తేలికగా మారుతుంది. చుక్కల్లారా.. మబ్బుల్లారా ఎక్కడమ్మా జాబిలి అంటు పలుకరిస్తే పండువెన్నెల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఔరా అమ్మకు చెల్లా అంటూ వినిపించగానే.. అప్పటి వరకూ పడిన ఒత్తిడి మటుమాయమవుతుంది. 1992 అక్టోబరు 9న విడుదలైన ఆ సినిమా.. చిరు సినీ చరిత్రలో అధ్యాయమనే చెప్పాలి. అంతకుముందే.. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషిలో మెప్పించిన చిరు.. ఆపద్బాంధవుడులో మరో మెట్టు పైకెక్కారు. దక్షయజ్ఞంలో శివుడుగా పలికించిన హావభావాలు.. నృత్యం.. వారెవ్వా అనిపిస్తాయి. ఏడిద నాగేశ్వరరావు – కె.విశ్వనాథ్ కలయికలో చివరి చిత్రం కూడా ఇదే. దర్శకుడు జంద్యాల మొదటి.. ఆఖరి సినిమా కూడా ఇదే కావటం యాదృచ్ఛికం.
చిరులో అప్పటి వరకూ బ్రేక్‌లు.. ఫైట్లు చూసిన ఆ నాటి యువ అభిమానులకు.. కొత్త మెగాస్టార్‌గా నటనా విశ్వరూపం ప్రదర్శించారు. తనకు గురుతుల్యుడుగా భావించే కుటుంబాన్ని కాసే గోపాలుడుగా మాదవ్.. హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా రసరమ్యంగా అనిపిస్తుంది. మీనాక్షిశేషాద్రి అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మైమరపించారనే చెప్పాలి. గాయపడిన మనసుతో పిచ్చాసుపత్రిలో చేరిన మీనాక్షిశేషాద్రిని మామూలు మనిషిగా చేసేందుకు చిరంజీవి అక్కడకు చేరతాడు. అక్కడ పిచ్చివాళ్ల మధ్య చిరంజీవి ఎంత గొప్పగా నటించారనేది చూస్తే కానీ అర్ధం కాదు. అప్పటి వరకూ నవ్వులు పండించి.. ఈలలు వేయించిన చిరంజీవి కంటతడి పెట్టిస్తారు. బాత్రూమ్‌లో అద్దాన్ని పగులగొట్టే సన్నివేశం.. ఆ తరువాత గురువు మరణించాడని తెలిసి గోదావరి తీరంలో బంకమట్టిని శివలింగంగా మార్చి.. దేవదేవుడిని ప్రశ్నించటం.. ఇవన్నీ మెగాస్టార్ లో అంతకు ముందు ఎన్నడూ చూడని మహానటుడుని ఆవిష్కరించాయి. కలెక్షన్ల పరంగా అంతగా రాకపోయినా.. చిరంజీవిని నటుడుగా నేషనల్ ఫిలింపేర్ అవార్డును అందుకునేలా చేసింది. నంది పురస్కారంతో మెగాస్టార్ అభిమానులను ఖుషీ చేసింది. నిన్ననే విడుదలైనట్టుగా అనిపించే ఆపద్బాందవుడుకు 28 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ది కావట్లేదంటారు చిరంజీవి అభిమానులు. ఈ తరం నటులు, అభిమానులు తప్పకుండా యువ నటీచూడాల్సిన సినిమా ఆపద్బాందవుడు.



