శరీరానికే కాదు.. అప్పుడపుడూ మనసుకూ కష్టం వస్తుంది. భరించలేనంతటి విసుగు పుడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) గణాంకాల ప్రకారం ఏటా 8,00,000 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో 79 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటున్నారు. 15-19 సంవత్సరాల వయసు గల యువతే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2019 లెక్కల ప్రకారం గతేడాది ఆత్మహత్యలకు పాల్పడిన యువతో ఎక్కువ మంది కేవలం వివాహం కావట్లేదనే మానసిక సమస్యతో మరణిస్తున్నారట. మరో విశేషమేమిటంటే.. ఏటా ఇండియాలో జరిగే సూసైడ్ కేసుల్లో ఎవరు ఎక్కువగా ఉంటున్నారో తెలుసా.. ఇంకెవరు పురుషులేనట.
మరి మనసును ఇంతగా మెలిపెడుతున్న బాధలను పంచుకునేందుకు ఆత్మీయమైన స్నేహితులుంటే.. అసలు ఆత్మహత్య ఆలోచనే రాదంటారు మనస్తత్వనిపుణులు. పోన్లే.. అందరికీ మంచి నేస్తాలు ఉండకపోవచ్చు. కానీ.. సికింద్రాబాద్‌లో ఉన్న రోష్నీ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కాల్‌సెంటర్ నిర్వహిస్తుంది. ఇక్కడకు ఎవరైనా.. ఏ వయసు వారైనా.. ఫోన్ చేసి తమ మనసులో బాధను పంచుకోవచ్చు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ శరీరానికే కాదు.. మనసుకూ చాలా కష్టంగా అనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన, గుబులు, కుంగుబాటు ఇలా.. ఎన్నో మానసిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి.
తమ మనసుకు కష్టం వచ్చిందని తెలియగానే రోష్నీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేయటమే..మనసులో బాధంతా పంచుకుంటే చాలు.. అటు నుంచి కౌన్సెలింగ్ నిపుణులు చక్కగా మాట్లాడతారు. అంతేనా.. మీ విషయాలను ఎవరికీ చెప్పరు. అవసరమైతే తాము మీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తే చేస్తారు. మనసులో బాధను ఒక్కసారిగా దింపుకున్న అనుభూతి కలిగేందుకు అమ్మగా.. నాన్నగా.. ఆత్మీయుడుగా మాట సాయం చేస్తారు. మానసిక జబ్బులు ఉన్న వారికి రోష్నీ నుంచి స్వయంగా వైద్యుల పర్యవేక్షణలో మందులు అందజేస్తారు. మీ గురించి మేమున్నామంటూ బోలెడంత ధైర్యాన్ని నింపుతారు. కాబట్టి.. మనసును ముసిరే నెగిటివ్ ఆలోచనలకు బెంబేలెత్తకుండా ఒక్కసారి రోష్నీ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి మాట్లాడండీ అంటున్నారు.
ఇవిగో ఫోన్‌నెంబర్లు.. 040 66202000, 66202001