వెండితెరపై నూటొక్కజిల్లాల అందగాడు నూతన్‌ప్రసాద్ కూడా ఇంత పేరు సంపాదించి ఉండకపోవచ్చు. అంతటి పాపులారిటీ ఒక్క గుండుతో సాధించాడీ నూతన్‌నాయుడు. అదేనండీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్. ఓవరాక్షన్‌తో సహచరులను.. ప్రేక్షకులను విసిగించి.. తానేదో సామాజిక ఉద్దరణ కోసమే పుట్టినట్టుగా బిల్డప్ ఇచ్చిన సదరు పర్సన్ ఈయనే. తన వ్యక్తిత్వం.. స్పూర్తి. ఆదర్శం.. ఇవన్నీ దేశానికి ఎంతో అవసరం అనేంతగా మాటలు.. బాబోయ్ ఇదంతా నిజమనే అనుకునేలోపుగానే.. అతడి ప్రవర్తన కనిపించింది. బాబోయ్ నిన్ను భరించటం మా వల్ల కాదంటూ బిగ్‌బాస్ నుంచి తరిమేశారట. మళ్లీ ఇన్నేళ్లకీ నూతన్‌నాయుడు తెరమీదకు వచ్చాడు. ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం.. అదేనండీ గుండు గీయించటంలో సాయపడ్డాడట. దీంతో ఓర్నీ నూతన్‌నాయుడా.. నువ్వూ గుండులు గీసిన బంటువేనంటూ సెటైర్లు కూడా మొదలయ్యాయి. ఇతగాడి లీలలు అన్నీ ఇన్ని కావంటూ అటు సోషల్ మీడియా… వెబ్‌సైట్లలో వైరల్ అవుతున్నాయి. 2014లోనే సమైఖ్యాంధ్రపార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాడట. అది కూడా లగడపాటి రాజగోపాల్ అనుచరుడుగానండోయ్. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. నూతన్‌నాయుడు ఏ కులం.. అసలు ఇంతకీ ఏ పార్టీ వ్యక్తి అనే చర్చ బాగానే సాగుతోంది. చౌదరిగారి అబ్బాయంటూ ఒకరు.. అబ్బే వెలమలండీ అంటూ మరొకరు. తూచ్ కాపులనుకుంటా.. లేకపోతే పవన్ వీరాభిమానినంటూ ఎందుకు చొక్కా చించుకుంటాడంటూ ఇలా ఎవరికి వారే అంచనాలే వేసుకుంటున్నారు. రాజకీయపార్టీలు కూడా నూతన్‌నాయుడు మీవాడంటే.. మీవాడేనంటూ మాటల దాడి చేసుకుంటున్నాయి. వైసీపీ అయితే.. ఘటన జరిగిన రోజే.. అతడు జనసేన కార్యకర్త… పవన్ అభిమాని అంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. ఇదంతా ఒట్టిదే.. అసలు నూతన్‌నాయుడు వైసీపీ సిద్ధాంత కర్త.. అంటూ టీడీపీ కొత్త పల్లవి అందుకుంది. అతడు టీడీపీయేనంటూ.. ప్రత్యర్థులు.. నూతన్‌నాయుడు, లగడపాటి రాజగోపాల్ ఉన్న ఫొటో సర్క్యులేట్ చేస్తున్నారు. 2019లో కూడా టీడీపీయే గెలుస్తుందంటూ.. ఆంధ్రాఅక్టోపస్ అదేనండి లగడపాటి ఒక మీడియా సమావేశం పెట్టి.. బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆ బల్లకు అటువైపు కుర్చీలో కూర్చున్న వ్యక్తి మరెవరో కాదు.. నూతన్‌నాయుడు అంటూ విమర్శలు. పైసా ఖర్చు చేయకుండా ఎవ్వరికీ రానంత పాపులారిటీ సంపాదించుకున్న నూతన్‌నాయుడు అనబడే ఈ సెలిబ్రీటీ ఏం తక్కువోడు కాదట. మందీమార్భలంతో గట్టిగానే మెంటార్‌గా వ్యవహరిస్తున్నారట. ఇంటిచుట్టూ సీసీ కెమెరాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాడు. తనకు ఇన్ని పార్టీలు అండగా ఉన్నాయనే గర్వంతోనే.. ఒక దళిత యువకుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఫోన్ పోయిందనే ఒకే ఒక్క సాకును చూపుతూ అతడిపై దారుణంగా దాడిచేసి.. గుండుగీయించటం సంచలనమైంది. కేసు నుంచి నూతన్‌నాయుడును కావాలనే తప్పించారంటూ ఆందోళన మొదలైంది. పోన్లే.. ఇవన్నీ కొద్దిసేపు పక్కనబెడితే.. నూతన్‌నాయుడు అనబడే ఈ వెరైటీ కేరక్టర్ ఏ పొలిటికల్ పార్టీ అనేది మాత్రం సస్పెన్స్.