తమ్ముడుకు అన్నయ్య అండ అనగానే ప్రత్యర్థుల గుండెలు గుబేల్ మన్నాయి. ఇద్దరూ కలయిక కొత్త సంచలనానికి నాందీ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వినేందుకు మస్త్‌గా ఉంది కదూ! మెగా బ్రదర్స్ కలయిక అంటే ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు. కోట్లాది మంది ఏపీ ప్రజలకు శుభవార్తే. కల్మషం తెలియని మెగా సోదరులను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రత్యర్థుల కుట్రలు మొదట్లో అర్ధం చేసుకోలేని అభిమానులకు క్రమంగా వాస్తవం తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పరాజయం.. పార్టీ దెబ్బతినేందుకు కోవర్టుల పన్నాగాలు అన్ని క్రమంగా వెలుగులోకి వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తెర వెనుక శక్తుల చీకటి రాజకీయం కూడా బయటపడింది. జనసేనతో పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా బయటకు వచ్చినపుడు కూడా ఇదేరకమైన ప్రచారంతో ప్రత్యర్థులు.. చవకబారు ప్రచారం చేశారు. అన్నకు తగిన తమ్ముడంటూ ఊదరగొట్టారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వటమే నేరమన్నట్టుగా.. బీజేపీతో చెలిమి పాపంమనేంతగా కొందరు చేసిన ప్రచారం 2019 ఎన్నికల్లో పవన్‌ను దెబ్బతీశాయి. కానీ.. ఏడాదిన్నర వ్యవధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కొంతమేరయినా.. పవన్ వెంట నడిచేందుకు యువత, మెగా అభిమానులు సిద్ధమయ్యారు. గెలుపు సంగతి ఎలా ఉన్నా.. పవన్ వెన్నంటి ఉండాలనే ఆలోచన మాత్రం కులాలకు అతీతంగా యువతలో కనిపిస్తోంది. ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పవన్ జరిపిన పర్యటనకు వచ్చిన స్పందన ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
ఇటువంటి సానుకూల స్పందన వస్తున్న సమయంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ బీజేపీ నేతలతో ఏర్పాటైన సమావేశంలో సంచనలమైన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్‌కు ఆయన అన్నయ్య చిరంజీవి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇది కొత్తగా వచ్చిన ప్రకటనేం కాదు. పలుమార్లు చిరంజీవి.. తామిద్దరం వేర్వేరు అయినా లక్ష్యం మాత్రం ఒక్కటేనంటూ అభిమానుల మధ్య పిలుపునిచ్చారు. తమ్ముడుకు అవసరమైన సమయంలో వెన్నంటి ఉండేందుకు సదా సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే స్థానిక ఎన్నికల సమయంలో బీజేపీ, సేన పొత్తు పొడిచే వేళ నాదెండ్ల ప్రకటన మెగా అభిమాను ల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఏపీలోని కోట్లాది మంది మెగా స్టార్ ఫ్యాన్స్, జనసేన అభిమానులు, బీజేపీ ముగ్గురి సమన్వయంతో విజయం సాధించాలనేందుకు పునాది వేసింది. గెలుపోటములకు అతీతంగా జనసేన బలమైన సత్తా చాటుతుందని.. ప్రజల్లో తమకున్న అభిమానం చాటుకునే సమయం వచ్చిందనేది జనసైనికుల ఆనందం.



