శ్రీకాకుళం జిల్లా అమ్మాయి స్వప్న. రెండు చేతులు సరిగా లేకపోయినా బోలెడంత ఆత్మవిశ్వాసం. ముఖంపై చిరునవ్వుతో తనలో లోపం ఉందని సానుభూతి చూపేవారికి సమాధామిస్తుంది. ఇదంతా ఎలా అబ్బిందంటే.. అదంతే అంటుంది. ఇంతకీ.. ఈ అమ్మాయి ఎవరి వీరాభిమానో తెలుసా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ అన్నయ్య స్పూర్తితో జీవితాన్ని తేలికగా గెలుస్తానంటోంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. స్వప్నకు చేతులు మాత్రమే లేవు. బోలెడంత ఆత్మాభిమానం కొండంత ఆస్తిగా ఉంది. ఎవరైనా దానం చేయాలని వస్తే వద్దని వారించింది. గాజుల దుకాణం కోసం సాయం చేయమని కోరింది. అంతే.. బోలెడంత జనసైనికులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. జనసైనికులు రూ.2లక్షలతో ఎంచక్కా షాపును ప్రారంభించేలా సాయపడ్డారు. అంతటితో ఆగితే స్వప్న ఎందుకవుతుంది.. సెప్టెంబరు 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్వప్న స్వయంగా చిత్రాన్ని గీసింది. అది కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. జనసేనాని వద్దకు చేరింది. అంతే.. అద్భుతమైన చిత్రాలు చూసి ఆయన ఫిదా అయ్యారు. అంతేనా.. మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జనసైనికులు తీసుకువచ్చారు. చాలా చక్కగా ఉంది తల్లీ. నేను విశాఖపట్టణం వచ్చినపుడు తప్పకుండా కలుస్తాను. జాగ్రత్త అమ్మ అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అంతే.. స్వప్న ఆనందానికి అవధుల్లేవట. ఎపుడెపుడు అన్నయ్యను కలుద్దామని ఎదురుచూస్తున్నానంటూ సంతోషం వ్యక్తంచేసింది స్వప్న. ఈ విషయం.. జనసైనికులు సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేసుకుంటున్నారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలు, యువతకు ఇటువంటి ప్రశంసలు.. ఎంతో నమ్మకాన్ని.. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తిని ఇస్తాయంటున్నారు జనసైనికులు. ఇదే స్పూర్తితో తాము కూడా దివ్యాంగులకు అవసరమైన సహాయం చేసేందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని గర్వంగా చెబుతున్నారు.