ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరిక. దేశంలో తొలిసారిగా నవంబరులో 91 లక్షల కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణల్లోనూ చాపకింద నీరులా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ప్రజల్లో వైరస్ పట్ల గతంలో ఉన్నంత భయం, జాగ్రత్తలు లోపించాయి. బయట తిరుగుతున్న వారిలో కేవలం 1 శాతం మంది మాత్రమే ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నట్టు ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ శర్వణ్ చెబుతున్నారు. చెన్నైకు చెందిన ఈయన కొద్దిరోజులుగా పరిస్థితులను అంచనా వేస్తూ వస్తున్నారు. పల్లెలతో పోల్చితేపట్టణ, నగరాల్లో కొవిడ్ మున్ముందు విశ్వరూపం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. చాలా మందిలో కరోనా బలహీనమైందనే అపోహ, అబ్బే మాస్క్ లేకపోయినా ఏం కాదనే నిర్లక్ష్యధోరణి పెరిగింది. వైరస్ శరీరంలోకి చేరిన తరువాత లక్షణాలు బయట పడేందుకు సమయం కూడా తీసుకోవటంతో సమయానికి తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల చివరిక్షణంలో తీవ్ర అనారోగ్యంతో మరణిస్తున్న వారి సంఖ్య 60 శాతం పెరిగిందట.
అందుకే.. కరోనా ఏం చేయదనే భావన వదిలేసి జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. సెకండ్‌వేవ్ ఎంత దారుణంగా ఉండబోతుందనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ అన్ని యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. వైద్యులు, పోలీసు, పారిశుద్ధ్య యంత్రాంగానికి ఇదో సవాల్‌గానే మారింది. మార్చి నుంచి నవంబరు వరకూ ముందు వరుసలో ఉన్న వారియర్స్ ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డుగా ఉంచారు. నెలల తరబడి ఇంటికి దూరంగా పిల్లల ముఖాలు చూడకుండా విధులకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరోసారి తమ కర్తవ్య నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడ ఆందోళన పడాల్సిన విషయం ఏమిటంటే.. కరోనాతో ఆసుపత్రులకు చేరుతున్న వారిలో 70శాతం మంది ఏకంగా ఐసీయూలోకే అడ్మిట్ అవుతున్నారట. దీన్ని బట్టి అర్ధం చేసుకోండి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందనేది. వైరస్ బలహీనపడింది. ఇంకేం చేయదనే అపోహతో విందులు, వినోదాలు, వేడుకల్లో మునిగితేలితే ఫలితం అనుభవించాల్సిందే. అందరకూ అనుకున్నట్టుగా వైరస్ ఉన్న వ్యక్తితోనే కాదు.. అతడి ఉమ్మి నుంచి కూడా వారం రోజుల్లోపు వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయంటున్నాయి పరిశోధనలు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్కటే ఇప్పుడు ప్రపంచానికి ఆధారం. మన హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కూడా రెడీ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీకాలు వచ్చినా కొవాగ్జిన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుందనేది తెలుస్తోంది.



