అత్తింటి నుంచి జీవనభృతి అందజేత – ‘మహిళా కమిషన్’ ను ఆశ్రయించిన కోడలికి న్యాయం ————————-

అమరావతి:
భర్త చనిపోయిన తర్వాత ఆమె పోషణాభారం బాధ్యతను అత్తామామ తీసుకోవాల్సిందేనని ‘ఏపీ మహిళా కమిషన్’ మరోమారు తేల్చి చెప్పింది. పోషణకు సంబంధించి అత్తింటి వేధింపుల నేపథ్యంలో మహిళా కమిషన్ ను ఆశ్రయించిన కోడలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. వివరాల్లోకొస్తే… చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహం కాగా, భర్త కిందటేడాది కోవిడ్ తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమెకు అత్తింటి నుంచి పేచీలు, వేధింపుల నేపథ్యంలో తనకు ఎక్కడా సరైన న్యాయం జరగడంలేదని.. చివరికి రాష్ట్ర మహిళా కమిషన్ ను జాహ్నవి ఆశ్రయించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి న్యాయం కోరుతూ అందించిన అర్జీపై విచారణ చేశారు. కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి కి కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. దీంతో ఇరుపక్షాలను మహిళా కమిషన్ కార్యాలయానికి పిలిపించి గజ్జల లక్ష్మి ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్లు, లీగల్ కౌన్సిలర్లు కేసును విచారించి వాసిరెడ్డి పద్మకు నివేదించారు. చట్టపరమైన హక్కులతో జాహ్నవికి జరగాల్సిన న్యాయం పై అత్తింటి వారిని ఒప్పించగా.. మంగళవారం వాసిరెడ్డి పద్మ చేతులమీదుగా ఆమె జీవనభృతికి సంబంధించిన మొత్తాన్ని చెక్కురూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి, కమిషన్ కార్యదర్శి శైలజ, సెక్షన్ ఆఫీసర్లు విజయశ్రీ, సంధ్య, లీగల్ కౌన్సిలర్ కె. పద్మ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here