మహిళా సమస్యలపై సత్వర విచారణ అవసరం

– ప్రభుత్వ శాఖాధిపతులతో జిల్లావారీ సమీక్షలు
– రాష్ట్ర మహిళా కమిషన్ నిర్ణయం
————————————-
అమరావతి:
మహిళలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం సత్వర విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ కేసులన్నింటిపై స్పందిస్తే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. గురువారం రాష్ర్ట మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన త్రైమాసిక సమీక్షకు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. రాష్ర్ట మహిళా కమిషన్ ఇప్పటికే అనేక సమస్యల నుంచి మహిళలకు విముక్తి కల్పించిందన్నారు.  జిల్లాలవారీగా వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో కేసులవారీగా సమీక్షలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.  రాష్ట్రంలో ప్రభుత్వం అనేక పథకాలను మహిళల పేరిట అమలు చేస్తుందని… మహిళా సాధికారత పై విస్తృత స్థాయిలో చర్చాగోష్టులు పెట్టాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నడిపే హోమ్ లను, స్వధార్, ఒన్ స్టాప్ సెంటర్ల తనిఖీలతో వాటి పనితీరును తెలుసుకుంటామన్నారు.
వైజాగ్ ప్రేమోన్మాది ఘటనపై ..
ఇటీవల వైజాగ్ లో ప్రేమోన్మాది పెట్రోలు దాడి ఘటనలో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే సమాచారం పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరాతీశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలకు సమాయత్తమవ్వాలని ఆమె కమిషన్ సభ్యులకు సూచించారు. అనంతపురం జిల్లా కదిరిలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటనపై మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న దుర్ఘటనలు, మహిళా బాధితులపై చర్చించారు. మహిళలకు రక్షణతో పాటు జీవితానికి భరోసానిచ్చేలా మహిళా కమిషన్ ముందుకు దూసుకెళ్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, జయలక్ష్మి, కమిషన్ కార్యదర్శి శైలజ, డైరెక్టర్ ఆర్ సూయజ్, సెక్షన్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here