వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీకు గుదిబండగా మారాడు. ఎలా వదిలించుకోవాలో అర్ధంగాక.. పార్టీ పెద్దలు కూడా తలలు పట్టుకోవాల్సిన దుస్థితి. అయినా ఎంపీ ఆర్ ఆర్ ఆర్ మాత్రం. పిచ్చోళ్లారా.. మీరు నన్నేం చేయలేర్రా అనటేమే కాదు.. వెంట్రుక కూడా హీకలేరంటూ సవాల్ విసిరారు. దీనిపై అధినేత జగన్ కూడా కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడట. అంతర్గత సమావేశాల్లో ఏదో ఒకటి చేయండ్రా బాబూ అంటూ కొందరు పేద్దలకు గడ్డికూడా పెట్టారట. సీఐడీ కేసుతో నోరుమూయిద్దామని చూసినా చివరకు సర్కారే అభాసు కావాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాక మరింత దాడి చేయటం ప్రారంభించారు. అందాకా ఎందుకు సీఎం జగన్ దిల్లీ యాత్రలో మొదటి ఎజెండా రఘురాముడిని ఎంపీగా తొలగించటం.. కానీ.. చట్టం.. రాజ్యాంగం మాత్రం ఎంపీను ఎలా తీస్తారనే ప్రశ్న వేస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ వైసీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నా అవేంటో చూపమంటున్నారు. ఇలాంటి సమయంలో రఘురామ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తారు. ఉద్యోగాల భర్తీ గురించి అడిగారు. పైగా .. వైసీపీ ఎంపీల్లో తన పేరును వెబ్ సైట్ నుంచి ఎందుకు తీశారంటూ కూడా నిలదీశాడు. ఏమైనా ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఈ దఫా మాంచి పట్టుదల మీదనే ఉన్నాడు. అవసరమైతే కాషాయం కప్పుకుని ఏదో విధంగా సహాయమంత్రి పదవి దక్కించుకుని అధినేతకు ఝలక్ ఇవ్వాలనేలా ఉన్నారట. దీనికోసం తన పరపతి ఉపయోగించి పైరవీలు కూడా మొదలుపెట్టారట. ఏమైనా.. జగన్ తీవ్రతకు.. దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకుని.. ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన మహామహులే నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. సొంత పార్టీనే దిక్కరించిన జేసీ బ్రదర్స్ కూడా ఇప్పుడు జగన్ మా వాడేనంటూ కేసుల్లేకుండా.. జైలు ఊచలు లెక్కబెట్టే అవకాశం లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. అలాంటిది సొంత పార్టీ ఎంపీ ఒకసారి సీబీఐ కేసు, మరోసారి సీఐడీ , ఏకంగా ఒక ప్రభుత్వమే కన్నెర్ర చేసినా.. ఓసోసి.. మీలాటోళ్లను చానామందిని చూశానంటూ కాలరెగరేసి.. మీసం మెలేస్తున్నాడు. ఇంతకీ ఇదంతా కాషాయం కప్పుకుంటే తననే ఎవరేం చేయలేరనే ధీమా కూడా కావచ్చనే గుసగుసలూ లేకపోలేదు సుమా!



