అర్రె.. నేను అలా అనలేదు. కనీసం నేను ఆ ఉత్తరం కూడా రాయలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇలా బయటకొచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదే రాజకీయమంటే అని తెలియటానికి ఆయనకు ఇంతకాలం పట్టిందన్నమాట. నిజానికి తమిళనాడులో రజనీ హవా తిరుగులేనిది. నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయస్థాయిలో తిరుగులేని హీరో కూడా. అందరూ స్టార్లు… సూపర్స్టార్లు రాజకీయాలను చివరిగా ఎంచుకుంటారు. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్‌కాంత్ , కృష్ణ.. చాంతాడంత జాబితా టాలీవుడ్, బాలీవుడ్, అన్నివుడ్స్లోనూ కనిపిస్తుంది. రజనీకాంత్ కూడా అందరి స్టార్లు మాదిరిగానే తమిళనాడులో తన క్రేజ్‌ను ఓటు బ్యాంకుగా మలచుకుని సీఎం కావాలనే గట్టిగానే భావించారు. కానీ.. రజనీ పుట్టినూరు కర్ణాటక కావటం.. పైగా తమిళనాట ఉండే ప్రాంతీయ భావన కాస్త ఇబ్బందిగా మారింది. రెండు మూడేళ్లుగా రజనీకాంత్ కొత్తపార్టీతో వస్తారంటూ ప్రచారం సాగుతూనే ఉంది. మరోవైపు నుంచి కమల్‌హాసన్ కూడా మై హూనా అంటూ తానొక రాజకీయపార్టీతో ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇద్దరు సూపర్స్టార్లతో రాజకీయం మాంచి ఊపు మీద ఉంటుందనే అంచనాలు పెరిగాయి.
2021లో అరవనాడులో పొలిటికల్ గేమ్ రసకందాయంలో పడుతుందనే భావన మొదలైంది. ఇంతలో రజనీ అనారోగ్య సమస్యలతో పార్టీ ఏర్పాటుపై సందిగ్థత నెలకొందనే వార్తలు షికారు చేస్తున్నాయి. బాబా సినిమా షూటింగ్ సమయంలోనే అనారోగ్యంపై పుకార్లు వ్యాపించాయి. 2011లో రజనీ కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సింగపూర్‌లో చికిత్స అనంతరం కుదుటపడ్డారు. 2016లో మరోసారి కిడ్నీ సమస్య తలెత్తడంతో చికిత్స పొందారు. ఇప్పుడు కరోనా వైరస్ విస్తరణతో ఆయన బయటకు రావటంపై ఆందోళనగా ఉన్నారట. అందుకే. పార్టీలు, ప్రచారంతో వైరస్‌కు గురవుతాననే ఉద్దేశంతో పార్టీ స్థాపన ప్రకటనపై పునరాలోచనలో పడినట్టుగా లేఖ ఒకటి రజనీకాంత్పేరుతో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన రజనీకాంత్ అబ్బే.. అది నేను రాసిన లేఖ కాదు. పార్టీ ఏర్పాటుపై రజనీ మక్కల్ మంద్రం సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానంటూ వివరణ ఇచ్చారు. డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను తట్టుకుని.. వారి రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కొని కొత్తగా వచ్చే రాజకీయపార్టీ నెగ్గగలదా! అనే అభిప్రాయం కూడా తమిళ ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టే.. రజనీ సినీ జీవితంలో సూపర్‌స్టార్‌గా ఎదిగి.. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్‌గా మారాలని భావించట్లేదట.