దక్షిణాధి రాష్ట్రాల్లో ముఖ్యంగా.. తెలంగాణ, ఏపీల్లో పాగా వేయాలనే బీజేపీ కల నెరవేరేలా ఆశలు రేకెత్తిస్తోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో పరాజయం పొందిన బీజేపీ నేతల్లో బండి సంజయ్ ఆ తరువాత 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. అంబర్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలచి తొలిసారి పరాజయం చవిచూసిన కిషన్‌రెడ్డి కూడా సికింద్రాబాద్ ఎంపీగా నెగ్గారు. ఇప్పుడు దుబ్బాకలో రెండుసార్లు ఓటమి చూసిన రఘునందన్‌రావు టీఆర్ ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని మరీ ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్నారు. ముగ్గురు ఓటమికి కారణమైన టీఆర్ ఎస్‌ను అదే చోట కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఓడించి.. సవాల్ విసిరారు. గులాబీ గూటిలో మొదటిసారిగా గుబులు పుట్టించారు. దుబ్బాక విజయం వెనుక పక్కాగా కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహమే ఉందనేది జగమెరిగిన సత్యం. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్.. బీసీ వర్గాలను ఏకం చేయటంలో అనుకున్నది సాధించారు. దుబ్బాకలో మున్నూరుకాపులు, ముదిరాజ్‌లను తమ వైపునకు తిప్పుకోవటం ద్వారా పై చేయి సాధించారు. ఇదే దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ తరువాత 2023లో గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేస్తామంటూ బండి సంజయ్ స్పష్టంచేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజుపై కూడా అదిష్ఠానం గట్టి నమ్మకమే పెట్టుకుంది. ఏపీలో వరుసగా జరిగిన దేవాలయాలపై దాడులపై వైసీపీ సర్కార్‌ను బాగానే దిక్కరించారు. జనసేనతో కలసి ఉద్యమాలు చేపట్టారు. ప్రభుత్వానికి కొద్దిరోజులు నిద్రపట్టకుండా చేయటంలో సఫలమయ్యారు. హిందుత్వ నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఇటవల వరదలు, ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పోరాటం చేశారు. కానీ.. ఎందుకో కొద్దిరోజులుగా మళ్లీ సైలెంట్ అయ్యారు. జనసేనతో కూడా అంటీఅంటనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ పుకార్లుగానే ఆయన కొట్టిపారేస్తున్నారు. తాజాగా దుబ్బాక ప్రభావంతో ఏపీలోనూ బీజేపీను జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. తెలంగాణలో ఉద్యమ స్పూర్తి ఎక్కువ. ప్రజా వ్యతిరేకతను ఒడసి పట్టడంలో సంజయ్ చాకచక్యంగా వ్యవహరించారు. ఏపీ విషయంలో అక్కడి ప్రభుత్వం, నాయకులు, కుల ప్రభావం అధికంగా ఉండటంతో బీజేపీ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ బయటపడే సాహసం చేయరు. ఏపీలోని కొన్ని ప్రతికూల పరిస్థితులు, హైకమాండ్ ఆదేశాలు సోము వీర్రాజు కాళ్లకు బంధాలుగామారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీతో ఉన్న అంతర్గత ఒప్పందాలతో రాష్ట్రంలో బీజేపీ ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉందనే విమర్శలున్నాయి. మరి వీటి నుంచి బయటపడి.. రాబోయే స్థానిక ఎన్నికల్లో సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని చోట్ల యినా గెలవగలిగితే… రాబోయే ఎన్నికల్లో బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లో సానుకూల ఆలోచనలు పునాది వేసిన వారవుతారనేది విశ్లేషకుల అంచనా.