ఎస్.. బల్దియా ఎన్నికల్లో కేటీఆర్ ఒక్కడే. మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీల్లో ప్రచారం చేస్తున్నా వ్యూహాలు. ప్రతివ్యూహాలు అన్నీ మంత్రి కేటీఆర్ వి మాత్రమే. నాలుగేళ్ల క్రితం గ్రేటర్ ఎన్నికల్లో అన్నీతానై నడిపించి 99 సీట్లు గెలిపించారు. 2014లో ఎన్నికల్లో గెలిచిన కేటీఆర్ మంత్రి అయ్యారు. రెండేళ్లకే పార్టీ బాధ్యతలు చేపట్టి బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురవేశారు. 2009లో కనీసం పోటీ కూడా చేయని చోట అధికారం చేపట్టడం వెనుక పూర్తిగా కేటీఆర్ వ్యూహాలే ఉన్నాయి. అప్పటి పరిస్థితులు కూడా బాగా అనుకూలించాయి. సీమాంధ్ర ఓటర్లు కూడా గులాబీ జెండాకు జై కొట్టారు. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వరదసాయం పేరిట జరిగిన అవినీతి మచ్చ టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. ఎంఐఎంతో పరోక్ష పొత్తు.. గెలిచే చోట కూడా కేవలం డమ్మీలకే ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం హైదరాబాద్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీన్ని సద్వినియోగం చేసుకోవటంలో బీజేపీ అనుకున్నదానికంటే ఎక్కువగానే విజయం సాధించింది. సెంట్రల్ నుంచి మంత్రులు, సీఎంలు కూడా ప్రచారానికి రావటంతో కాషాయ పార్టీకు మాంచి ఊపు వచ్చింది.
ఊహించని విధంగా కమలం పార్టీకు జనాల్లో జోష్ పెరిగింది. ఇవన్నీ కేటీఆర్ వ్యూహాలను చెదరగొట్టాయి. అభ్యర్థుల ఎంపికలోనూ ఎమ్మెల్యేలు విముఖంగా ఉండటం కూడా టీఆర్ ఎస్‌ను ఇబ్బందికి గురిచేశాయి. తేలికగా గెలవాల్సిన హైదరాబాద్ మేయర్ పీఠం ఇంత కష్టంగా మారుతుందని ఊహించని కేటీఆర్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితులు దారి తీశాయి. హరీష్‌రావు కూడా ప్రచారంలో కనిపించట్లేదు. దుబ్బాక ఓటమి తరువాత దాదాపు హరీష్ సైలెంట్ అయినట్టుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బల్దియా ఎన్నికల్లో టీఆర్ ఎస్ మేయర్ పీఠం గెలుచుకుంటుందనేది అందరీకీ తెలిసిందే. కానీ. నాలుగు సీట్లకు పరిమితమైన బీజేపీ ఒక్క సీటు పెంచుకున్నా అది టీఆర్ ఎస్ పై ప్రభావం చూపుతుంది. అది పూర్తిగా కేటీఆర్ ఖాతాలోనే పడుతుందనే విశ్లేషణలూ లేకపోలేదు. అందుకే.. పది రోజులుగా కేటీఆర్ అన్నీతానై నడిపిస్తున్నారు. రోజూ 20కు పైగా కార్యక్రమాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీగా మారారు. బీజేపీ నుంచి తలపండిన సీనియర్లంతా ఏకమై కేటీఆర్‌ను ఒంటరిగా మార్చారు. అన్నయ్యకు తోడుగా సోదరి కవిత కూడా పలు డివిజన్లలో ప్రచారం సాగిస్తున్నారు. వీరిద్దరు కలసి ఎంత వరకూ కారు వేగాన్ని పెంచుతారనేది చూడాలి. ఈ పోరాటంలో తారక రాముడు అర్జునుడుగా విజయం సాధిస్తారా.. అభిమన్యుడుగా ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూస్తారా అనేది తేలాలంటే డిసెంబరు 4వ వరకూ ఆగాల్సిందే.