సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయపార్టీ పెడతారా! బీజేపీకు అనుకూలంగా ఉంటారా! ఎటూ తేలకుండానే ఫ్యాన్స్ ఊహించని షాకిచ్చారు. మీరు పార్టీ స్థాపిస్తే ఉంటాం.. బీజేపీతో దోస్తీ చేస్తే పక్కకు తప్పుకుంటామంటూ అల్టిమేటం ఇచ్చారు. 2021లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. జయలలిత, కరుణానిధి వంటి మహామహులు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య జరిగే పోరుగానే లెక్కలు వేసుకుంటున్నారు. సినీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ రాజకీయ పార్టీలతో అక్కడ కూడా స్టార్లుగా ఎదగాలనే ఆలోచనలో ఉన్నారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రమ్మంటూ ఆహ్వానించటం ఇది తొలిసారేం కాదు.. దాదాపు 20 ఏళ్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడే . కానీ ఎందుకో ఆయన తటపటాయిస్తూ వస్తున్నారు. ఆ మధ్య రజనీ తమిళనాడు వ్యక్తికాదంటూ దుమారం లేవనెత్తారు. కన్నడ రాష్ట్రంనుంచి వచ్చి స్థిరపడిన రజనీ తాను తమిళనాడు బిడ్డగానే వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత గతేడాది అభిమానుల మీటింగ్‌తో పార్టీపై హింట్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, అనారోగ్య సమస్యలతో ఆయన షూటింగ్‌లు, అభిమానులకూ దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి రజనీ అభిమాన సంఘాలను రమ్మంటూ కోరటంతో రజనీ పార్టీపై చర్చ మొదలైంది. ఆయన బీజేపీకు అనుకూలంగా ఉంటారనే వార్తలు రావటం.. దక్షిణాధిన పాగా వేసేందుకు కమలం పార్టీ కూడా సినీస్టార్లకే ప్రాధాన్యతనివ్వటంతో అభిమానులు రజనీకు షాక్ ఇచ్చారు. మరి దీన్నుంచి బయటపడి.. వారిని సర్దిచెప్పి పార్టీను ఎలా నడిపిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే విజయ్‌కాంత్, విశాల్, శరత్‌కుమార్, విజయ్, కమల్‌హాసన్ వంటి స్టార్లు కూడా రాజకీయబాట పట్టారు. కొందరు రాజకీయ లక్‌ను పరీక్షించుకునే పనిలో పడ్డారు. తొలి దశలోనే రజనీకు ఎదురవుతున్న చికాకులను అధిగమించి ఎలా ఒంటరిగా బరిలో నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.