సొంత లాభం కొంతమానుకుని పొరుగు వారికి సాయపడవోయ్. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పద్యం. ఉపాధ్యాయుడు చెప్పేటపుడు తరగతి గదిలో అందరూ పద్యం ఆలపించారు. కానీ ఒక్క పిల్లవాడి మనసుపై చెరగని ముద్రవేసింది. దాన్ని కేవలం పద్యంగా.. మార్కులిచ్చే చదువుగా చూడకుండా ఆచరణగా మార్చుకున్నాడు.. సాయం చేయాలంటే ఉండాల్సిన మనసు కానీ.. సొమ్ములు కాదని నిరూపిస్తున్నారు. ఆయన పేరు రామిరెడ్డి శ్రీధర్.. అందరూ ముద్దుగా ఎల్ ఐసీ శ్రీధర్ అంటారు. పుట్టిపెరిగింది. మాత్రం కృష్ణాజిల్లా నందిగామ మండలం.. సమీపంలోని కంచెల అనే ఒక గ్రామం. ఆ ఊరు నుంచి రహదారి వద్దకు రావాలంటే ఐదు కిలోమీటర్లు నడక. స్వచ్ఛమైన గాలి.. అంతకు మించి మంచి మనసున్న పల్లె ప్రజలు. అటువంటి వాతావరణంలో పెరిగిన శ్రీధర్ చదువు పూర్తయ్యాక.. భీమా రంగాన్ని ఎంచుకున్నారు. అది తన వృత్తి.. కుటుంబ పోషణకు తాను ఎంచుకున్న మార్గం.
కానీ.. దాదాపు 19 ఏళ్లుగా.. సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎవరి సాయం కోరకుండా.. తాను ఎంచుకున్న సేవా మార్గంలో అందమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 2001 నుంచి ఇప్పటికీ వేలాది సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2015లో తాను పుట్టిపెరిగిన కంచెల గ్రామంలో అక్షరజ్ఞానం.. సామాజిక విజ్ఞాన్ని పంచేందుకు సొంతగా గ్రంథాలయం నిర్మించారు. విద్యార్థులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు ఉంచారు. మారుమూల పల్లె పిల్లలు ఏ సమాచారం
తెలుసుకోవాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరాన్ని దూరంచేసి శభాష్ అనిపించుకున్నారు.
ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. పర్యావరణాన్ని వేధిస్తున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ముందడుగు వేశారు. మొక్కల పంపిణీతో వేలాది మొక్కలను నాటించారు. వాటి సంరక్షణ బాధ్యతను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సంకల్పంతో గొప్ప యజ్ఞమే చేపట్టారు. పాలిథీన్, ప్లాస్టిక్ సంచుల వాడకానికి బదులుగా గుడ్డ సంచులు, జనపనార బ్యాగులను భారీగా పంపిణీ చేశారు. శ్రీధర్ అనే పేరును సార్థకం చేసుకున్నావంటూ స్నేహితులు ప్రశంసలూ కురిపిస్తుంటారు.
తన సంపాదించే సిరిలో కొంత భాగాన్ని సేవకు.. ధరణికి అండగా నిలవాలనే మొక్కల పెంపకాన్ని చేపట్టే శ్రీధరుడు.. నిజంగానే శ్రీమంతుడు. ఇరవైఏళ్ల క్రితమే.. గ్రామాలకు సేవ చేయాలనే తలంపుతో ఆలోచనలను ఆచరణలోకి మార్చుకున్న స్పూర్తిదాత.
ప్లాస్టిక్ నిషేధంపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించే అధికారులను కోర్టుకు రప్పించి మరీ.. నిబంధనలు అమలయ్యేలా న్యాయపోరాటం చేశారు. తాను ఎంచుకున్న మార్గంలో ఎదురయ్యే విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ.. వెనుక నుంచి వెటకారం చేసేవారినీ పట్టించుకోకుండా ముందుకు సాగే.. రామిరెడ్డి శ్రీధర్ వంటి పర్యావరణ ప్రియులు.. సేవా తత్పరుల.. మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో ఇచ్చిన ఊరికి కొంతైనా చేద్దామనే పిలుపును ఆచరిస్తున్నారు.