అంతన్నాడు.. ఇంతన్నాడు.. కానీ.. ఒక్క అంగుళం కూడా పడలేదు. ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేనతో కలసి జనాల్లోకి వెళ్తామంటూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ప్రతినబూనారు. అంతవరకూ కమలంలో కాస్త కదలిక తెచ్చినట్టే. మాటలు కోటలు దాటితే చేతలు కనీసం గడప కూడా దాటట్లేదంటూ సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏపీలో విపక్షాలన్నీ విఫలమైన వేళ సోము వీర్రాజుకు అందిన అద్భుతమైన అవకాశం సరిగా వాడుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. అందాకా ఎందుకు.. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలకు ఏడాది ముందుగానే ప్రణాళిక సిద్ధమవుతుంది. అటువంటి పండుగపై కరోనా ముసుగులో ఆంక్షలు విధించటంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగానే స్పందించారు. హిందు సంస్థలు, ఏబీవీపీ, వీహెచ్‌పీ వంటి వాటితో కలసి తెలంగాణ సర్కారుపై ఆందోళనలు చేపట్టి హిందువుల గొంతుకగా నిలిచారు. మరి ఏపీలో బీజేపీ ఏం చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇప్పుడు అనుకున్నంత సానుకూలంగా ఏమీలేవనేది జగమెరిగిన సత్యం. మూడు రాజధానుల ముచ్చట. తరచూ కోర్టుతో అక్షింతలు వేయించుకుంటూ వైసీపీ ప్రభుత్వం క్రమంగా పలుచన అవుతుంది. దీన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు టీడీపీకు ఉన్నా.. గత తప్పిదాలకు భయపడి వెనుకంజ వేస్తున్నాయి. అచ్చెన్న, జేసీ ప్రభాకర్‌రెడ్డి జాబితాలో తాము కూడా చేరతామనే భయం టీడీపీ సీనియర్లలో కొట్టొచ్చినట్టుగా ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే స్పందించే సైనికులున్నా ఆయన కూడా అమావాస్య, పున్నమికి ట్వీట్లు విసిరి తప్పుకుంటున్నారు. ఇదంతా సామాన్య ప్రజల్లో విపక్షాల పట్ల వ్యతిరేకతను పెంచుతాయనేది గత తాలూకూ అనుభవాలు. ఏపీకు ప్రత్యేకహోదా ఇవ్వటంలో బీజేపీ సర్కారు మోసం చేసిందనే బాధను క్రమంగా మరచిపోతున్నారు.
ప్రస్తుతం జగన్‌పై క్రమంగా ప్రజా వ్యతిరేకత మొదలవుతోంది. అదే సమయంలో చంద్రబాబు పట్ల సానుభూతి పవనాలు కూడా వీస్తున్నట్టు సంకేతాలున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కన్నా అధ్యక్షుడుగా ఉన్నపుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘోరంగా విమర్శించారు. కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ అంటూ.. కోట్లాదిరూపాయలకు అమ్ముడుపోయాడంటూ విమర్శలు చవిచూశారు. సోము వీర్రాజు విషయంలో అలాంటి విమర్శలకు తావులేదు. ఎందుకంటే. టీడీపీతో దోస్తీ ఉన్నపుడే చంద్రబాబు విధానాలను సోము వీర్రాజు తప్పుబట్టారు. శాసనమండలిలోనూ టీడీపీ అవినీతిని ఎండగట్టారు. కన్నా లక్ష్మినారాయణ ఈ విషయంలో విఫలయ్యాడనే ఉద్దేశంతో భాజపా సోముకు పగ్గాలు అప్పగించింది. దీని ప్రభావం సామాన్య కార్యకర్తల్లో సంతోషాన్నిచ్చినా.. నేతల్లో మాత్రం వర్గ విబేధాలు సృష్టించింది. కంభంపాటి రామ్మోహన్‌రావు, కామినేని శ్రీనివాస్, దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి రాజకీయ ఉద్దండులున్నా.. సోముకు వర్గ పోరుతో ఒంటరి ప్రయాణం తప్పేలా లేదు. హిందుత్వ భావన ఏపీ ప్రజల్లోనూ మొలకెత్తుతున్న సమయంలో సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ఎందుకో తప్పటడుగు వేస్తున్నారు. ఫలితంగా అందివచ్చే అవకాశాలను చేతులారా జాడవిడుచుకుంటున్నారనేది బీజేపీ కార్యకర్తల్లో ఆందోళనకు అసలు కారణం. కేంద్రంలో మోదీ హవాను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తెప్పించగలగాలి. జనసేనకు మరింత చేరువైన కలసికట్టుగా నడవాలనేది ఇరు పార్టీ కార్యకర్తల సూచన.