స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉద్యోగసంఘాల నేత. తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా. ఒకప్పుడు స్వామిగౌడ్ హంగామా వేరు. శానసమండలి ఛైర్మన్ గా ఐదేళ్లు ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఎందుకో పార్టీ అదిష్టానం దూరం పెడుతూ వచ్చిందనే అభిప్రాయం బలపడుతూ వస్తోంది. 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2019లో పార్లమెంటరీ ఎన్నికల వేళ చేవెళ్ల సీటు కోసం గట్టిగానే పట్టుబట్టారు. కానీ ఎందుకో పార్టీ రెండుసార్లు హ్యాండిచ్చింది. నామినేటెడ్ పోస్టులపై ఆశపడినా అదీ తీరేలా కనిపించలేదు. కేసీఆర్‌కు తాను కుడిభుజమని భావించి అధినేత పట్ల భక్తితో ఉండే స్వామిగౌడ్ క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణలో కేవలం కొన్ని కులాలను మాత్రమే అందలం ఎక్కిస్తున్నారంటూ బాంబులాంటి వార్త పేల్చాడు. దీనిపై టీఆర్ ఎస్ శ్రేణులు ధీటుగానే స్పందించాయి. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములేనంటూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా మల్కాజగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని స్వామిగౌడ్ ఒక సభలో ఆకాశానికి ఎత్తేశాడు. బలహీనులకు రేవంత్ ప్రతినిధి అంటూ పొగడ్తలు కురిపించాడు. తెల్లబట్టలు వేసుకున్న నాయకులకు అమ్ముడు పోవద్దంటూ ఎవరి గురించే పరోక్షంగా ప్రస్తావించాడు. దీంతో స్వామిగౌడ్ దాదాపు పార్టీ మారటం ఖాయమనే అనుమానాలకు బలం చేకూరినట్టయింది. అయితే.. ఆయన బీజేపీలోకి చేరతారా! హస్తంలో కలసి నడుస్తారా! అనేది ఇప్పటికైతే సస్పెన్స్.