తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రాజధాని ప్రాంతంలో టీడీపీ ను ఢీ కొని గెలిచిన మహిళా నేత. వైసీపీ గాలిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించే ఆమెకు అనుకోని అవకాశం. అప్పటికే తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై వ్యతిరేకత కూడా బాగా కలసివచ్చింది. కానీ.. రాజధాని ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఏడాదిన్నర కాలంగా ఏదో ఒక వివాదంలో వివాదాస్పదంగా మారుతున్నారు. అక్కడి ప్రజలు.. నాయకులతో సరిగా కలవకపోవటం.. తన వర్గంలోనే ఆమెకు వ్యతిరేకత రావటం వంటివి చికాకు పెడుతున్నాయి. నియోజకవర్గ ప్రజలతోనూ సయోధ్య లేదనే అపవాదు ఉంది. రాజధాని ప్రాంతంలో దాదాపు 300 రోజులుగా చేస్తున్న దీక్షపై ఆమె ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు.
ఇవన్నీ పక్కనబెడితే.. గతేడాది వినాయచవితి ఉత్సవాల్లో శ్రీదేవి గణేశుని మండపంలోకి రాకుండా స్థానికులు అడ్డుకోవటం కలకలం రేకెత్తించింది. శ్రీదేవి ఎస్సీ కాదంటూ దాఖలైన పిటీషన్ కోసం ఆమె స్వయంగా కలెక్టర్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత తన ఇలాఖాలో ఎమ్మెల్యే పెత్తనం చేస్తుందంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో గొడవ తారాస్థాయికి చేరింది. ఇసుక అక్రమాలపై కూడా ఇద్దరి మధ్య రచ్చ పార్టీ పెద్దల వరకూ చేరింది. చివరకు బడానేతలు మధ్యవర్తిత్వంతో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. అంత వరకూ బాగానే ఉంది.. ఇటీవల పేకాటక్లబ్బుపై దాడిచేసిన పోలీసులు ఎమ్మెల్యే అనుచరులను పట్టుకున్నారు. ఉండవల్లి సారథ్యంలోనే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఇటీవల రవి అనే బాధితుడు వ్యక్తి ఉండవల్లి శ్రీదేవికి తాను అప్పుగా ఇచ్చిన రూ.కోటి డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తుందంటూ సెల్ఫీవీడియో తీసి మరీ జగన్ మోహన్‌రెడ్డికి పంపటం సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగానే.. ఎమ్మెల్యే గుంటూరు అర్బన్ పట్టాభిపురం ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్రతో ఫోన్‌లో చేసిన సంభాషణ కలకలం రేకెత్తించింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నానా దుర్భాషలాడింది. తన కాళ్లు పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నావంటూ సదరు ఇన్‌స్పెక్టర్‌పై శివాలెత్తారు ఎమ్మెల్యే. నీకేమైనా మెంటలా అంటూ.. తాను ఒక ఎమ్మెల్యే అని మరచిపోయి మరీ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌పై నోరుపారేసుకోవటం పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న శ్రీదేవి.. ఎందుకిలా మారారంటూ సొంతపార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారట. పైగా.. వైసీపీ నేతలు ఏదైనా ప్రారంభోత్సవానికి పిలిచినా.. కూడా నా స్థాయికి అది చాలదంటూ కూడా ముఖానే చెప్పేస్తున్నారట. దీంతో ఆమెను.. అతిథిగా పిలవటానికి కూడా రాజధాని ప్రాంత వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారట. ఏమైనా.. తరచూ శ్రీదేవి వివాదాల్లో చిక్కుకోవటం పార్టీకు కూడా చెడ్డపేరు తెస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
తరచూ తనకు ఎదుర్కొంటున్న వివాదాలపై శ్రీదేవి మాత్రం.. ఇదంతా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నట్టుగానే చెబుతున్నారు. తనకు పెరుగుతున్న క్రేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు స్వపార్టీ నేతలు కూడా తెర వెనుక నుంచి ఇవన్నీ నడిపిస్తున్నారంటున్నారు. ఈ లెక్కన.. ఎంపీతో సయోధ్య కుదిరినా.. అంతర్గత పోరు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగానే పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి.