చిన్నమ్మ చక్రం తిప్పుతుందా.. రజనీకాంత్ మాయాజాలం వర్కవుట్ అవనుందా.. కమలహాసన్ రాజకీయ అవతారం ఎత్తుతారా.. విజయ్ సీఎం అవుతారా.. పళినిస్వామి ఏ మంత్రం వేస్తారు. స్టాలిన్ ఎత్తుగడలు ఏమిటీ.. బీజేపీ పాగా వేసేందుకు ఎలాంటి ప్లాన్‌లు సిద్ధం చేసుకుంటోంది. తమిళ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు. సోదర రాష్ట్రమే అయినా ఎందుకో అక్కడ తెలుగు రాష్ట్రాలను మించిన రాజకీయాలు గగురుబాటు కలిగిస్తుంటాయి. 2021 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏఐడీఎంకే, డీఎంకే, మధ్య ప్రధాన పోటీ సాగినా.. సినిమాలంటే ప్రాణమించ్చి అందమైన ఖుష్బూ వంటి తారలకు గుడికట్టించేంత అభిమానం అక్కడే కనిపిస్తుంది. అంతగా సినిమా ప్రభావం చూపే తమిళనాటు.. ముగ్గురు అగ్రహీరోలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్ ఈ ముగ్గురు కలసి బరిలోకి దిగుతారా.. పార్టీలు పెట్టి మరీ వేరు కుంపటిగా మారతారా! అనేది ఆసక్తిగా మారింది.
ఇక్కడ మరోవిశేషమేమిటంటే.. తొలిసారి రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావటమే రాజకీయ ఎత్తుగడలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపగల ప్రతివ్యూహాలతో రసవత్తరమైన రాజకీయాన్నినడిపించిన ఆ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఒకరు అనారోగ్యంతో.. మరొకరు వయోభారంతో కన్నుమూశారు. ఇప్పుడు వారి వారసులుగా చెప్పుకుంటున్న వారికి ఈ ఎన్నికలు పెనుసవాల్. దశాబ్దాలుగా కట్టుకున్న కంచుకోటను ఎవరు బద్దలు చేస్తారనేది డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలను భయానికి కూడా గురిచేస్తున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో ఏఐడీఎంకే 134, డీఎంకే 98 సీట్లు సాధించాయి. కానీ మధ్యలోనే జయలలిత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. 100 రోజుల పాటు అపోలో వైద్యులు చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. వరుసగా రెండోసారి వరుసగా గెలిచినా ఎక్కువకాలం పాలన చేయలేకపోయారు. 6 డిసెంబరు 2016లో మరణించారు. ఆ తరువాత పన్నీరుసెల్వం, పళినిస్వామి, శశికళ పేర్లు బయటకు వచ్చాయి.
కానీ అక్రమాస్తుల కేసులో శిశికళ జైలకు వెళ్లటంతో పన్నీరుసెల్వం, పళినిస్వామి ఇద్దరూ పోటాపోటీగా క్యాంపులు పెట్టారు. జైల్లో ఉన్న చిన్నమ్మ రాజకీయ వ్యూహంతో పన్నీరుసెల్వం సీఎంగా ఎంపికయ్యారు. 2001పన్నీరుసెల్వం తొలిసారి జయలలిత జైలుకెళ్లినపుడు సీఎంగా కొద్దిరోజులు పనిచేశారు. అలా అమ్మకు అనుంగుడుగా మిగిలాడు. ఇప్పుడు 2021కు పన్నీరుసెల్వం సీఎం అభ్యర్ధిగా బరిలోకి దిగాలనేది చిన్నమ్మ హుకుం. కానీ.. పళినిస్వామి కూడా పోటీపడుతూ తానే సీఎం అభ్యర్థినంటున్నాడు.
ఈ సారి స్టాలిన్ కూడా బలంగానే కనిపిస్తున్నాడు. తండ్రి కరుణానిధి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సీఎం కావాలనే యోచనలో ఉన్నాడు. తండ్రికి తాను సీఎం పీఠంపై కూర్చోవటం ద్వారా నివాళి చెప్పాలనుకుంటున్నాడు. జయలలితపై ఉన్న సానుభూతిని అవకాశంగా మలచుకుని హ్యాట్రిక్ కొట్టాలనేది ఏఐడీఎంకే ఎత్తుగడ. కానీ రజనీకాంత్ కూడా రాజకీయపార్టీతో ఏకంగా గెలుపుపై గురి పెట్టాడు. కమల్‌హాసన్‌తో కలసి రాజకీయం చేయాలనే వ్యూహాత్మకంగా ఉన్నారట. విజయ్ కూడా నేను సైతం అంటూ దూకుడు పెంచాడట. విజయ్‌కాంత్ కూడా గతంలో పార్టీ పెట్టినా అంతగా జనాధరణ పొందలేకపోయారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఎంత వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనేది అనుమానంగా మారింది.
ఏమైనా ఈ సారి తమిళనాడు ఎన్నికలు మంచి రసవత్తరంగా.. అరవసినిమాను మించి మాస్ మసాలాతో విందు చేబోతున్నాయనేది వాస్తవం.