ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు. ఎప్పుడు ఏపీ ఓటర్లు నెత్తిన పెట్టుకుంటారో.. ఎవర్ని ఢామ్మంటూ కిందపడేస్తారో చెప్పటం కూడా కష్టమే. ఏ రెండు కులాలు ఏ సమయంలో ఒక్కటవుతాయనేది అంచనా వేయటం కూడా కష్టమే. 2014 ముందు వరకూ కాపు , రెడ్డి దోస్తీ కట్టారు. 2014 ఎన్నికల్లో కాపు, కమ్మ నేస్తాలయ్యారు. 2019లో మూడు కులాలు మూడు భాగాలుగా మారాయి. ఎవరి ఇష్టమైన పార్టీ జెండా ఆయా కులాలు మోసుకున్నాయి. ఇదంతా అదోరకం రాజకీయమనే భావనకు పునాది వేశారు. మరి 2024లో ఏం జరుగుతుంది. అసలు ఏ కులాలు కలుస్తాయి.. మూడు కులాలు మూడు ముక్కలాట ఆడుకుంటాయి. లేకపోతే.. కమ్వ రెడ్డి, కాపు రెడ్డి, కమ్మ, రెడ్డి, రెడ్డి కాపు ఇలా.. కాపు కమ్మ ఇలా ఏ రెండు కులాలు జతకడతాయనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఏపీలో కుల సమీకరణ మాత్రమే రాజకీయపార్టీలను గద్దెనెక్కిస్తుంది. అమాంతం కిందకు లాగేస్తుంది. అందుకే.. 2024లో కాపు, కమ్మ కలయికతో ఎలాగైనా రెడ్డి వర్గానికి సీఎం పీఠం అందకుండా చేయాలనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఇదంతా నిజంగానే ఆ రెండు కులాల్లో ఉందా! కావాలనే తెలివిగా ఆ రెండు కులాల్లోకి ఎక్కిస్తున్నారా! అనేదానికి సరైన సమాధానం లేదు . మొన్నీ మధ్య ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జనసేన, టీడీపీ ఓట్లను చీల్చుకోవటం ద్వారా వైసీపీ లాభపడుతుందంటూ విశ్లేషించారు. ఇద్దరూ కలవటం ద్వారా వైసీపీను విపక్షంలోకి నెట్టేయవచ్చనే సలహా కూడా ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ అదేనండీ జూనియర్ ఏదో సినిమా ఫంక్షన్‌కు వెళితే.. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేసిన అభిమానులు నానా రచ్చ చేశారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్‌బాబుల గుండెల్లో గునపం లాంటిదే అయినా… ఐసీయూలో ఉన్న టీడీపీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ టీడీపీ సీనియర్ల నుంచి కూడా సూచనలు వస్తున్నాయి. అటువంటి వేళ జూనియర్ ఎన్టీఆర్‌పై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఆయన రాక వల్ల.. మెగాఫ్యామిలీతో ఉన్న సంబంధాలు.. రాజకీయ బంధాలుగా మార్చవచ్చు. ఏదో విధంగా మళ్లీ జనసేనానిని చంద్రబాబుతో దోస్తీ కట్టించి.. మీది తెనాలే.. మాది తెనాలే అన్నట్టుగా.. మీరు మేం భాయి. భాయి అననూ వచ్చు. కానీ.. నేతలు కలుస్తారు.. మరి కేడర్ ఎంత వరకూ కలుస్తుందనేది సస్పెన్స్. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్నట్టు.. రెండు పార్టీలు కలవనూ వచ్చనేది తెలుగు తమ్ముళ్ల దింపుడు కళ్లెం ఆశ.