తెలుగుదేశం పార్టీ ఫినిష్. ఇవే ఆఖరి ఎన్నికలు అనుకున్న ప్రతిసారి పసుపుదళం పోరాటపటిమ కనిపిస్తుంది. ఓడిపోతారు అనుకునే ప్రతి సందర్భాన్ని విజయానికి అవకాశంగా మలచుకున్నారు. ఇదంతా చంద్రబాబు చాణక్యంగానే పార్టీ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. 2019లో ఒక్కసారిగా బొక్కబోర్లా పడటంతో పెదబాబు, చినబాబు పనైపోయిందనే ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన సుజనాచౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి వాళ్లు కూడా పక్కకు జరిగారు. దేశం జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, గణేష్.. ఇలా కొందరు వైసీపీ పక్కకు చేరారు. పోతూపోతూ.. బాబు నాయకత్వంపై బురదజల్లి పోయారు.
కేవలం కొంతమంది నాయకులను నమ్మటం వల్ల బాబు బాగా దెబ్బతిన్నాడంటూ సీనియర్ నేతలు కూడా అంటుంటారు. వెంకన్న, అయ్యన్నపాత్రుడు, నారాయణ, దేవినేని, ప్రత్తిపాటి వంటి నాయకులు కూడా పార్టీకు నష్టం తీసుకురావటంలో భాగం పంచుకున్నారు. సైకిల్ చక్రాల నుంచి ఒక్కో ఊచ ఊడిపోవటంతో తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తేయాల్సిందే అనేంతగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ బలహీనపడితే.. తాము లాభపడతామంటూ బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఎవరికి వారే అంచనా వేసుకుంటున్నారు. నిజంగానే టీడీపీ కిందపడితే.. తాము పైకి లేస్తామని లెక్కలు వేసుకోవటంలో వాస్తవాలు ఎంత అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
నేతలు పార్టీ మారినంత మాత్రాన పార్టీ పట్ల అంకితభావం గల కార్యకర్తలు , అభిమానులు దూరమవుతారా! అనే సందేహం కూడా లేకపోలేదు. నేతలు మారినా.. ఎమ్మెల్యే, ఎంపీలు కండువాలు కప్పుకున్నా తాము నమ్మిన పార్టీ జెండాలను మోస్తూనే ఉంటామని గర్వంగా చెప్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకు కొండంత బలం. 2014లో టీడీపీలోకి 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ.. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ కు బలమైన కార్యకర్తలను మాత్రం తమ వెంట రప్పించుకోలేకపోయారు. కాబట్టే.. అక్కడ 2019లో వైసీపీ అభ్యర్థులే గెలిచారనేది విశ్లేషకుల అంచనా. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లినా అసలైన టీడీపీ కార్యకర్తలు గెలుపోటముల్లో తమ వైపు ఉంటారనేది టీడీపీ ధీమా.
ఒకవేళ బాబు వయోభారం, లోకేష్‌బాబు నాయకత్వ లోపం వల్ల టీడీపీ బలహీనపడితే.. వైసీపీను వ్యతిరేకించే టీడీపీ కార్యకర్తలు బీజేపీ, జనసేనలను ప్రత్యామ్నాయంగా భావిస్తారు. మైనార్టీలు, బీసీలు వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. హిందు నినాదాన్ని నెత్తికెత్తుకున్న జనసేన, బీజేపీలకు టీడీపీ వైఫల్యం మరింత కలసివస్తుందనేది ఆ పార్టీ పెద్దలు వేసుకుంటున్న లెక్కలు.. ఏమైనా టీడీపీను అంత తేలికగా అంచనా వేయటం కూడా కష్టమే. ఒత్తిడిలో ఉన్నపుడు ఎవరైనా తప్పటడుగు వేస్తారు. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం ఎంత ఎక్కువగా ఒత్తిడికి గురైతే అంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న గత అనుభవం. ఇన్ని తెలిసినా ఏ పార్టీకు ఆ పార్టీ టీడీపీ బలహీనపడితే తామే లాభపడతామంటూ భరోసాగా ఉన్నాయి. గ్రౌండ్‌లెవల్లో టీడీపీ కేడర్‌ను తక్కువగా అంచనా వేయటం కూడా సరికాదని కూడా అంచనా వేసుకుంటున్నాయట. 2023లో జమిలి ఎన్నికలు జరిగితే.. అప్పటి రాజకీయ పరిస్థితులను చంద్రబాబు ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారనేది మరో ప్రశ్న.