ఏది చేసినా ఒక లెక్క ఉండాల. ఎలాంటి ఎత్తులు వేసినా ప్రయోజనం దక్కాల. మంచి చెడులు. సమీకరణలన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాలు కేంద్రంగా నడపటం టీడీపీలో కొత్తేం కాదు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది.. అధికారం సంపాదించేందుకు అనువైన మార్గాలను ఎంపిక చేసుకుంటాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవైనా ఇవే లెక్కలు ఉంటాయి. ఇటువంటి రాజకీయాల్లో చంద్రబాబు చాణక్యత బయటపడుతూ ఉంటుంది. తనను ఎవ్వరూ గమనించట్లేదనే భ్రమలో ఉంటారు. అందుకే.. 2014కు ముందు దూరంగా ఉంచిన కాపు వర్గానికి రెండు డిప్యూటీ సీఎంలు, హోమంత్రి అంటూ.. ఎన్నికల హామీ.. పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో ఓటమి నుంచి బయటపడ్డారు. ఐదేళ్లలో కాపులకు బీసీ రిజర్వేషన్ హామీకు ఝలక్ ఇచ్చారు. కాపు కార్పోరేషన్ ద్వారా ఏటా రూ.1000 కోట్లు అంటూ ఊరించి ఉసూరుమనిపించారు. కోస్తాలో కాపులు.. సీమలో రెడ్లను పక్కన బెట్టుకున్నా.. అధికారం మాత్రం తన వారికే పట్టం గట్టారనే భావనతో రెండు వర్గాలు క్రమంగా దూరమవుతూ వచ్చాయి.
2019లో ఎదురైన చేదు అనుభవంతో చంద్రబాబు వ్యూహం 2020లో బీసీలకే పెద్దపీట వేస్తున్నట్టుగా పదవులు కేటాయించారు. తెలంగాణలో టీడీపీ ఉపాధ్యక్ష పదవిని నందమూరి సుహాసినికి ఇవ్వటం ద్వారా ఎన్టీఆర్ కుటుంబం అనే సెంటిమెంట్‌ను తీసుకెళ్లాలనే ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతుంది. అదే సమయంలో ఏపీలో బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుకు అధ్యక్షుడుని చేశారు. కమ్మవర్గానికి చెందిన గల్లా అరుణ తాను పార్టీకు దూరంగా ఉన్నానంటూ చెప్పినా పోలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇచ్చారు. వంగలపూడి అనిత వంటి వారికీ పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. రాయలసీమలో బలమైన భూమా, జేసీ కుటుంబాలను మాత్రం దూరంగా ఉంచారు. ఎన్నికల ముందు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న ఆ ఇద్దరూ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో గట్టి పట్టున్న రెడ్డి వర్గ నేతలు కూడా. అయినా ఎందుకు ఆ ఇద్దరీకి పార్టీలో పదవులు ఇవ్వలేదనేది అంతుబట్టకుండా ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన భూమా అఖిలప్రియరెడ్డి వర్గానికి బలమైన కేడర్ ఉంది. అయితే.. తల్లిదండ్రుల మరణంతో అఖిల ఒంటరిగా మారింది. అయినవారిని కూడా కలుపుకుని పోకుండా ఉండటం వల్ల చిక్కులు ఎదుర్కొంటోంది. జేసీ బ్రదర్స్ కూడా అదే దూకుడు స్వభావంతో కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారనే గుసగుసలూ లేకపోలేదు.
ఇప్పటి వరకూ అధికార పార్టీల పంచన ఉండటం వల్ల వారేం చేసినా చెల్లుబాటైంది. ఇప్పుడు.. వైసీపీ పోనీలే అని వదిలేయకుండా అవకాశం దొరికిన ప్రతిసారీ ప్రత్యర్థులకు చుక్కలు చూపుతోంది. ఆ జాబితాలో జేసీ ప్రభాకర్‌రెడ్డి , భూమా అఖిలప్రియ కూడా చేరారు. ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు, కృష్ణాలో కొల్లు రవీంద్రలు కూడా నేరాభియోగాలతో జైలు కెళ్లొచ్చారు. అయినా వారికి
మాత్రం పార్టీ పదవులు దక్కాయి. పార్టీను అంటిపెట్టుకుని ఉన్న చినరాజప్ప, కళా వెంకట్రావు, బోండా ఉమా వంటి కాపు నేతలకు మొండిచేయి చూపారు. సీమలో రెడ్డి వర్గ నేతలకూ ఇదే విధమైన ఝలక్ ఇచ్చారు. ఈ లెక్కన.. రాబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లకు గాలం వేసేందుకు కాపు, రెడ్లను దూరంగా పెట్టినట్టుగా ఆ రెండు సామాజికవర్గాల నేతలు భావిస్తున్నారట.