తెలుగు సీఎంలిద్దరూ భాయి..భాయీగా పనిచేద్దామనుకున్నారు. ఇద్దరికీ కామన్ శత్రువు చంద్రబాబు కాబట్టి.. ఆ ఇద్దరి స్నేహబంధం పదికాలాలపాటు ఉంటుందనే భావించారు. 2019లో జగన్ సీఎం కావాలంటూ తెలంగాణలో మీటింగ్‌లు పెడితే బాబు వ్యతిరేకులంతా గులాబీజెండాకే జైకొట్టారు. ఈ నాటి ఈ బంధమేనాటిదో అనుకుంటూ ఎంచక్కా తీయటి సరాగాలు పాడుదామనుకుంటే.. ఇంతలో కృష్ణాజల వివాదాలు. రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు అందించాలనే జగన్ ఆలోచన బ్రహ్మాండం. కానీ.. అక్కడే తెలంగాణ ప్రభుత్వ ఇగో దెబ్బతిన్నది. అస్సలు నీరిచ్చేందుకు మీరెవరు? అయినా అది కేవలం విద్యుత్ ఉత్పత్తికేనంటూ అపెక్స్ కమిటీలో తేల్చుకుందామనుకున్నారు. ఫాపం.. ఆ మీటింగ్‌కు రావాల్సిన మంత్రికి కరోనా రావటంతో ఇప్పుడొద్దు.. కొన్నాళ్లు వాయిదా వేద్దామంటూ చేతులు దులుపుకున్నారు. ఇంతలోనే.. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి చేసేచోట ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది ఇంజనీర్లు బలయ్యారు. సీఐడీ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ పవర్ సరఫరాకు ఎందుకు సిద్ధమయ్యారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. పోన్లే.. కాలం కలసిరాలేదనుకుంటే.. ఏపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో లోపాలను కోర్టు ప్రశ్నించింది. అవ భూముల్లో ఇళ్ల నిర్మాణం వద్దంటూ ఆదేశించింది. మూడు రాజధానులు మూడురోజుల్లో తేల్చాలనుకున్న జగన్‌కు కోర్టు ఎదుట మొట్టికాయలు తప్పలేదు. సుప్రీంకోర్టులో తేల్చుకుందామనుకుంటే.. ఏం బాబూ హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ ఆగలేకపోయారా! అంటూ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శకుడు శంకర్‌కు ఇచ్చిన భూమిపై కూడా తెలంగాణ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోట్ల విలువైన భూములను లక్షలకే ఎలా ఇస్తారంటూ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారంటూ సమర్ధించుకునేందుకు ప్రయత్నించింది. అయినా కోర్టు.. ఇప్పటికే ప్రపంచప్రఖ్యాతి గాంచిన రామోజీఫిల్మ్‌సిటీ ఉండగా.. మరొకటి ఎందుకంటూ ప్రశ్నించింది. ఒకవేళ కాదనుకుంటే.. ప్రభుత్వమే ఎందుకు నిర్మించకూడదనే ప్రశ్నకు సమాధానం కూడా భారమైందట. ఏమైనా.. తెలుగు సీఎంలకు తరచూ కోర్టుల ఎదుట ఎదురవుతున్న ప్రశ్నలు కాస్త చికాకు పెడుతున్నాయట. తెలుగు రాష్ట్రాలను.. అమెరికా, లండన్, సింగపూర్‌కు ధీటుగా మారుద్దామనుకుంటే.. అబ్బే.. వీళ్లకు పనీబాట లేదు. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారనేంత చికాకు పడుతున్నారట.



