గాల్వాన్ లోయలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. రోజురోజూ ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. ఇండియా- చైనా ఎవ్వరూ పట్టు వీడేందుకు అంగీకరించట్లేదు. ఫాంగాంగ్ సరస్సు దక్షిణం వైపు ఉన్న ఫింగర్ 4 వరకూ చేరిన ఇండియన్ ఆర్మీ పాగా వేసింది. ఇండియా తమ స్థలాన్ని ఆక్రమించుకుందంటూ చైనా వాదనకు దిగుతోంది. వాస్తవానికి ఫింగర్ 8 వరకూ గతంలో సైనికులు పహారా కాసేవారు. మంచుకురిసే సమయాన్ని అనుకూలంగా మలచుకుని చైనా లిబరేషన్ ఆర్మీ దాన్ని చేజిక్కించుకుంది. జూన్ 15 కర్నల్ సంతోష్‌కుమార్ బృందం జరిపిన దాడి కూడా అదే ప్రదేశంలోనే. ఇప్పుడు అక్కడ ఇండియన్ ఆర్మీ పాగా వేయటాన్ని చైనా జీర్ణించుకోలేకపోతుంది. దీంతో వారం రోజులుగా నిశ్చబ్దంగా ఉన్న వాతావరణం.. ఒక్కసారి మారిపోయింది. సోమవారం చైనా భారీగా సైనికులను మోహరించింది. లోపలకు చొచ్చుకు వస్తున్న వారిని నిలువరించేందుకు భారత సైనికులు గాల్లోకి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువైపులా భారీగా సైన్యం మోహరించటం.. పెద్ద ఎత్తున ఆయుధాలు.. యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తమను ఎదుర్కోనేందుకు చైనా ఆర్మీ రావటంతో హెచ్చరికగా కాల్పులు జరిపినట్టు భారత్ చెబుతోంది. కానీ.. భారత్ కావాలనే తమను రెచ్చగొడుతుందని చైనా వాదిస్తోంది. నలభై ఏళ్ల తరువాత తొలిసారిగా అక్కడ తుపాకులు గర్జించటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందనేది అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం రాకపోయినా.. పాకిస్తాన్ ద్వారా భారత్ వైపు ఒత్తిడి తెచ్చేందుకు చైనా ఎత్తులు వేస్తుందనేది మాత్రం ఆర్మీ పసిగట్టింది. సైనికుల దృష్టి మరో వైపు మరల్చేందుకు చైనా వ్యూహ రచన చేస్తుందనేది కూడా తెలుస్తోంది. దీనికి తగినట్టుగానే అవసరమైతే ఏకకాలంలో ఇరువైపులా పోరు చేసేందుకు ఇండియన్ ఆర్మీ పథక రచనలో ఉంది.