కారు.. క‌మ‌లం దుబ్బాక‌లో స‌మ‌రం!

దుబ్బాక ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. హైద‌రాబాద్‌లో మ‌రింత టెన్ష‌న్ నెల‌కొంది. మూడు ప్ర‌ధాన పార్టీలు ఇది చావో రేవో తేల్చుకుందామ‌నేంత‌గా పోరాడుతున్నాయి. అధికార టీఆర్ ఎస్‌కు ఇది గుదిబండ‌గా మారింద‌నే చెప్పాలి. అటు హ‌రీష్‌రావు అయితే.. దుబ్బాక మీదనే దృష్టి పెట్టారు. కేసీఆర్ తెర వెనుక రాజ‌కీయాలు నెర‌పుతుంటే తాజాగా కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి సోంపేట రామ‌లింగారెడ్డి 62,500 మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అప్పుడు మూడో స్థానంలో ఉంది. కానీ.. ఉప ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ, టీఆర్ ఎస్ మ‌ధ్య పోటీ మ‌రింత ఉత్కంఠ‌త‌ను రేకెత్తిస్తోంది. రెండు ల‌క్ష‌ల మంది ఓట‌ర్లున్న నియోజ‌క‌వ‌ర్గంలో కూలీనాలీతో బ‌తుకీడ్చే కుటుంబాలే ఎక్కువ‌. అక్క‌డ కేసీఆర్ పాల‌న‌పై మిశ్ర‌మ స్పంద‌న ఉంది. అదే స‌మ‌యంలో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుపై సానుభూతి కూడా ఉంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత‌ను బ‌రిలోకి దింపినా.. ఆమె మాట‌ల్లో రాజ‌కీయ ప‌రిణితి ఏ పాటిదో బ‌య‌ట‌ప‌డుతుంది. పైగా.. సుజాత గెలిచినా.. వెనుక నుంచి చక్రం తిప్పేది మాత్రం హ‌రీష్‌రావు అనే వాద‌న కూడా లేక‌పోలేదు.

అందుకే.. బీజేపీ ఈ సారి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తుంది. అంత‌కుమించిన కేసీఆర్ స‌ర్కారు కూడా బీజేపీను ఎమోష‌నల్‌గా దెబ్బ‌తీసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తుంది. దుబ్బాక‌లో మొన్న డ‌బ్బు సంచుల స్వాధీనం చేసుకోవ‌టం. తాజాగా హైద‌రాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్ధి ర‌ఘునంద‌న్‌రావు మామ‌, డ్రైవ‌ర్ నుంచి పంపిణీ కోసం తీసుకెళ్తున్న కోటిరూపాయ‌లు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లో అల్ల‌ర్ల‌కు బీజేపీ కుట్ర చేస్తుందంటూ టీఆర్ ఎస్ శ్రేణులు డీజీపీకు పిర్యాదు కూడా చేశాయి. దీంతో ఎన్నిక‌ల‌కు ఒక్క‌రోజు ముందు అంటే.. 2వ తేదీ సోమ‌వాం హైద‌రాబాద్‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది . బీజేపీ నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ గృహ‌నిర్బంధం చేశారు. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుంద‌నే వాతావ‌ర‌ణంలో న‌గ‌రం ఉంది. మ‌రి న‌వంబ‌రు 3న జ‌రిగే దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో 28 గ్రామాల‌ను స‌మ‌స్యాత్మ‌కంగా గుర్తించారు. వ‌రుస‌గా బీజేపీ నేత‌ల‌పై కేసులు.. వ‌రుస దాడులు సానుభూతిని కురిపిస్తాయ‌నేది ర‌ఘునంద‌న్ వ‌ర్గం ఆశ‌లు. కేసీఆర్‌పై ఉన్న న‌మ్మ‌కం.. హ‌రీష్‌రావు వ్యూహంతో దుబ్బాక‌లో ల‌క్ష మెజార్టీ ఖాయ‌మంటూ కారు దూకుడు. మ‌రి ఎవ‌ర్ని దుబ్బాక ఓట‌ర్లు క‌నిక‌రిస్తార‌నేది 10వ తేదీ ఓట్ల లెక్కింపుతో కానీ బ‌య‌ట‌ప‌డ‌ద‌న్న‌మాట‌.

Previous articleగాజువాక హ‌త్య‌లో ఇంత దారుణం దాగుందా!
Next articleగోమాత కౌగిలింత‌కు ఫుల్ డిమాండ్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here