కొణిదెల శివశంకరవరప్రసాద్.. రాత్రికి రాత్రే చిరంజీవిగా పేరు మార్చుకున్నంత మాత్రాన మెగాస్టార్ కాలేదు. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అవరోధాలు. అంతకు మించిన ఎత్తుపల్లాలు. చిరునవ్వు వెనుక వెన్నుపోట్లను తప్పించుకుని.. తడబడుతూ వేసిన అడుగులను ఉన్నతికి మెట్లుగా వేసుకుని 30 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా అందుకున్న బిరుదు మెగాస్టార్. కేవలం నాలుగు స్టెప్పులు.. ఆరు డ్యూయెట్లు మాత్రమే కాదు.. అంతకు మించిన సహనం.. అమ్మనాన్నలు పంచిన మానవత్వం.. ఇదే చిరంజీవితత్వం అంటూ ఫ్యాన్స్‌కు నేర్పారు. హీరో ఫ్యాన్స్ అంటే.. కటౌట్లు.. కొబ్బరికాయలు కొట్టడమే కాదు.. రక్తదాతలు, నేత్రదాతలు కూడా అని చాటిన ఘనత చిరంజీవిది.. అదే స్పూర్తితో ముందుకు నడుస్తున్న అభిమానులదీ.
కరోనా సమయంలో గతేడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి నెలల తరబడి సినీ కార్మికుల కుటుంబాల ఆకలి తీర్చుతున్నారు. ఆపదవేళ ఇంటి గుమ్మం తొక్కినా .. తొక్కకున్నా.. తెలిసిందే తడవుగా ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. అదే మార్గంలో ఇప్పుడు తెలుగు నాట చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తుంది. మొన్న చిరంజీవి మాట ఇచ్చినట్టుగానే ఏర్పాట్లు చకచక పూర్తవుతున్నాయి. జిల్లా అభిమాన సంఘాలు ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. పశ్చిమగోదావరి, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం తదితర జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్ ట్రేటర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది.
ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో #ChiranjeeviOxygenBanks సేవలు వినియోగించుకోవచ్చు.రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు.@KChiruTweets pic.twitter.com/IVnvIYjMiq
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 26, 2021
ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు. “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు నాట అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ప్రాణవాయువు పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ లేకపోవటం వల్ల చైనా నుంచి ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు తెప్పిస్తున్నాం. ఎక్కడ అత్యవసరంగా అవసరమో తెలుసుకుని అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. జిల్లాల్లో ప్రతిచోటా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ సమయంలో చేరుకుంటున్నాయి.. ఎక్కడైనా అవరోధ ఉందా అనే విషయాలను ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా చూస్తున్నాం. హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కార్యాలయం నుంచి కో ఆర్డినేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ఏర్పాట్లన్నీ రామ్‌చరణ్ పర్యవేక్షిస్తుంటారని మెగాస్టార్ చిరంజీవి మీడియాకు వెల్లడించారు.