మహిళలను బలోపేతం చేయడమే సబల ముఖ్య ఉద్దేశం… -మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

మహిళలను బలోపేతం చేయడమే సబల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ‘సబల ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వై వి ఎస్ ఆడిటోరియంలో ‘మహిళలపై లైంగిక వేధింపులు, హింస’అంశంపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, విద్యార్థినిలచే ఒకరోజు సదస్సు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళలపై, పాఠశాలలు, కళాశాలలలోని విద్యార్థినీలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి జగన్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ శాఖలు, వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండే మహిళలను బలోపేతం చేయడమే సబల లక్ష్యమని, ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిస్తే వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్‌ 63026 66254 నంబరు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు సబలపై అవగాహన కల్పించడానికే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏయు వైస్ ఛాన్స్లర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు నాయకత్వ లక్షణాలు అలవడాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నారన్నారు. దిశ యాప్ ను మొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్ బీచ్ రోడ్డు లోని ఏయూ కాన్వకేషన్ సెంటర్ లో ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఏయూ లోని విద్యార్థినిల సంరక్షణ కోసం ‘క్యాంపస్ కాప్’ ఇక్కడ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వీరి కోసం ఏయూ లోని తమ హాస్టల్ లో సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చదువుతోపాటు, ఓ అరగంట సమయం సామాజిక సేవకు కేటాయించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపస్ కాప్ సభ్యులకు ఉచితంగా క్యాంపస్ కాప్ లోగోతో ఉన్న టీ షర్ట్ లను అందజేశారు. అదే విధంగా వివిధ కాంపిటేషన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి వారంతా పాలాభిషేకం చేశారు. ఈ సదస్సులో వీఎంఆర్డిఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, అడిషనల్ ఎస్పీ సిఐడి కె.జి.వి.సరిత, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శ్యాముల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, చల్లా శ్రీనివాసరావు, బొప్పారాజు వెంకటేశ్వర్లు, కె.వి.శివారెడ్డి, కె.రామ సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి, రాజ్యలక్ష్మి, వి. నిర్మలకుమారి, జి.నిర్మల జ్యోతి, పరమేశ్వరరావు, ఆర్ డి వి ప్రసాద్, హైమావతి, శ్రీరామ్మూర్తి, రవి, చౌదరి పురుషోత్తం నాయుడు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Previous articleలక్షలాది సామాన్య ప్రజలకు జీవిత భాగస్వామి ఎంపికలో సాయపడడం కోసం జోడీ యాప్ ప్రారంభం
Next articleఈవిల్‌ లైఫ్‌ ట్రైలర్‌ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here