మొన్న మైనంపల్లికి ఎదురుగాలి.. నిన్న మంత్రి మల్లారెడ్డికి చీవాట్లు.. తాజాగా ఎంఐఎం అదినేత అసదుద్దీన్‌కు విమర్శలు.. కాంగ్రెస్ నాయకులు అయితే ఎందుకు వచ్చారంటూ ఎదురుతిరిగారు. ఔను.. ప్రజలు బాగా చైతన్యవంతులయ్యారు. కేటీఆర్, కేసీఆర్, ఉత్తమ్, కిషన్‌రెడ్డి ఇలా.. ఏ నేతను వదలిలే ప్రసక్తి లేదంటున్నారు. 2020 మ్యాచ్‌ను తలపించేలా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు తమకు నల్లేరు మీద నడక అని టీఆర్ ఎస్ భావించింది. దుబ్బాక ఫలితం ముందు మంత్రి కేటీఆర్ తమకు ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో 100 సీటలోపు వస్తాయంటూ ధీమాగా చెప్పారు. కానీ.. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో బీజేపీ ఊపిరిపోసుకుంది. దీనికి తగినట్టుగా.. కమలం అధినేత బండి సంజయ్ దూకుడు కూడా మరింత కలసివచ్చింది. అంతే.. గెలుపు గ్యారంటీ అనుకున్న చోట ఎదురవుతున్న పోటీతో టీఆర్ ఎస్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.
ఇక్కడే అసలు కష్టం టీఆర్ ఎస్‌ను వేధిస్తుంది. 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడిన వారికి కార్పోరేటర్లు ఆశించినంత సాయం చేయలేదు. పైగా ప్రచారంలోనూ వారెంట నడవలేదు. ఇప్పుడు కార్పోరేటర్ల వంతు వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు తమకు నచ్చని అభ్యర్థులను మార్చించారు. మరికొందరు అంటీ అంటనట్టుగా వున్నారు. దీంతో ఇప్పుడు కార్పోరేటర్ల అభ్యర్థులకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ.. కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో కార్పోరేటర్ల గెలుపును ఎమ్మెల్యేల భుజాన వేశారు. ఏ మాత్రం తేడాలొచ్చినా ఎమ్మెల్యేలకే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ లెక్కన డివిజన్ లలో కార్పోరేటర్లను గెలిపించుకోకుంటే దాని ప్రభావం సంబంధిత ఎమ్మెల్యేల రాజకీయ జీవితంపై కూడా ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌కు పీఠం సంగతి ఎలా ఉన్నా.. కనీస సీట్లు గెలుచుకోపోతే పరువు పోతుందనే భయంలో ఉన్నాయి.