మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడినట్టు తెలియగానే టాలీవుడ్ ఉలికిపాటుకు గురైంది. కొవిడ్19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రముఖ హీరో ఇలా వైరస్ కు గురవటంపై ఆందోళన నెలకొంది. ఏడు నెలల విరామం తరువాత సినీ పరిశ్రమ ఇప్పుడిపుడే షూటింగ్‌లు మొదలు పెట్టింది. దాదాపు 25000 మంది కార్మికులు పనిచేసే తెలుగు సినీ పరిశ్రమ కోట్లాదిరూపాయలు నష్టపోయింది. హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్లపై కూడా భారీ కోత పడింది. వచ్చిందే కట్నం అన్నట్టుగా ఎంత వచ్చినా లాభమే అన్నట్టుగా నటీనటులు ఫిక్స్ అయ్యారు. కరోనా నిబంధనల ప్రకారం సినిమా, వెబ్‌సీరిస్‌లు చేస్తున్నా చాపకింద నీరులా వైరస్ మాత్రం పాకిపోతుంది. ఇటీవలే నాగబాబు, తమన్నా వైరస్‌కు గురయ్యారు.. త్వరగానే కోలుకుని సాధారణ స్థితికి వచ్చారు. కానీ.. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, నటుడు జయప్రకాశ్‌రెడ్డి మరణాలు గుబులు పుట్టించాయి. దాన్నుంచి కోలుకుని తిరిగి బయటకు వస్తున్న సమయంలో చిరంజీవి తానే స్వయంగా కొవిడ్ భారినపడినట్టు ట్వీట్ చేయటంతో కలకలం మొదలైంది. రెండ్రోజుల క్రితమే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్, నటుడు నాగార్జున అందరూ కలిశారు. ఇప్పుడు వారికి కూడా వైద్యపరీక్షలు చేయించాల్సి ఉంది. ఎటువంటి లక్షణాలు లేకుండా వైద్యపరీక్ష చేయించేంత వరకూ వైరస్ ఉందనే విషయం బయటకు తెలియకపోవటం ఆందోళన కలిగిస్తుంది. వైరస్ తగ్గుతుందని భావిస్తున్న వేళ ఇది అన్నివర్గాలకు ఊహించని షాక్‌గానే ఉంది. ఆచార్య షూటింగ్‌కు తొలి నుంచి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అన్నీ సద్దుమణిగి రీ షూటింగ్‌కు సిద్ధమవుతున్న వేళ మరో అపశృతి వైరస్ రూపంలో వెంటాడటం.. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.



