కేసీఆర్ ఎంత అంటే అంత. ఆయన మాటే మాకు శాసనం. ఇదీ కొన్నాళ్ల కింద గులాబీ నేతలు చెప్పిన మాటలు. కానీ క్రమంగా వారిలో ఆ విశ్వాసం సన్నగిల్లుతోంది. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే పెత్తనం చేస్తుందని.. ఎంపీ,ఎమ్మెల్యేలు, మంత్రులు పేరుకు మాత్రమేనంటూ అసహనం పెరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీలో ఎదురైన చేదు అనుభవంతో గులాబీ రేకులు నెమ్మదిగా వీడిపోతున్నాయి. మొన్న బీజేపీ నేత లక్ష్మణ్ అన్నట్టుగా. . మంత్రులు కాషాయ గూటికి చేరటం సంగతి ఎలా ఉన్నా.. వీరి ఆగడాలు మాత్రం పెరుగుతున్నాయి. మొన్నటి వరదల్లో తలసాని, పద్మరావుగౌడ్, నేతి సుభాష్‌రెడ్డి, మహమూద్ అలీ వంటి నేతలను జనం విమర్శించారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని పరాభవించి పంపారు. చివరకు పాతబస్తీలో తానే కింగ్ అని భావించే అసదుద్దీన్ ఓవైసీను కూడా వరద బాధితులు ఛీ కొట్టారు. కళ్లెదుట ఇంతటి వ్యతిరేకత కనిపిస్తున్నా.. గులాబీ పార్టీ నేతలు మారట్లేదు. కేసీఆర్‌కు వీళ్ల ఆగడాలు తలనొప్పిగా మారుతున్నాయి. భవిష్యత్‌లో టీఆర్ ఎస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నారనే ఆందోళన లేకపోలేదు.
తాజాగా ముషీరాబాద్‌లో బంద్ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనుచరులు బ్యూటీ పార్లర్‌మీద దాడి చేశారు. తమను ఓడించారనే అక్కసుతోనే డివిజన్ నేతలు దీనికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తలసాని అనుచరులు కూడా కాస్త చెలరేగుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు పోలీసుల కళ్లెదుట జనంపై దాడికి పాల్పడ్డారు. రోడ్లను బ్లాక్ చేయటాన్ని ప్రశ్నించిన సామాన్యులపై నోరు పారేసు కోవటమే కాదు.. ఏకంగా దెబ్బలు కూడా కొట్టారు. కుత్బుల్లాపూర్ లోనూ అక్కడి ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డి తన 2 ఎకరాల స్థలాన్ని కబ్జాచేశారంటూ శ్యామల అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై వార్తలు రాశారంటూ పటాన్‌చెర్వు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వార్త విలేకరి సంతోష్ నాయక్‌కు చంపుతానంటూ బెదిరించాడు. దీనిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. మొన్నీ మధ్య జూబ్లీహిల్స్ ఎమ్మల్యే మాగంటికి అనుకూలంగా ప్రవర్తించిన ఎస్ ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులుపై కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇలా.. కాపాడాల్సిన పాలకులే సామాన్యులపై జులుం ప్రదర్శించటాన్ని కేసీఆర్, కేటీఆర్ చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇదిలాగా కొనసాగితే భవిష్యత్‌లో బీజేపీ చేతికి తేలికగా పగ్గాలు ఇచ్చినట్టే అవుతుందనే ఆందోళన గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది.