ఇది ఎవరో చేస్తున్న ఆరోపణలు కాదు.. స్వయంగా మంత్రి కేటీఆర్ అన్న మాటలు. వరంగల్, అదిలాబాద్, జగిత్యాల, హైదరాబాద్ వంటి కీలకమైన జిల్లాల్లోని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హద్దు మీరుతున్నారు. మరి ఇదంతా పార్టీపై, నాయకత్వంపై ఉన్న అక్కసా లేకపోతే.. తమ పెత్తనం చాటుకోవాలనే పెద్దరికమో కానీ గులాబీ పార్టీకు ముక్కలు చేస్తారనే ఆందోళన పార్టీ వర్గాల్లో లేకపోలేదు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు.. ఆయోధ్య రామాలయానికి బిచ్చమెత్తుకుంటున్నారంటూ బీజేపీపై నోరుజారారు. అసలు అయోధ్య మనది కాదంటూ కూడా స్పందించారు. బీజేపీపై విమర్శలు చేయటం సహజమే కానీ.. రాముడిని మధ్యలోకి తీసుకొచ్చి ఇలా నోరుజారు అభాసుపాలు కావటమే పార్టీకు ఇబ్బంది గామారింది. గతంలోనూ హిందుగాళ్లు.. బంధుగాళ్లంటూ అధినేత జారిన మాటతో నాలుగు ఎంపీ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఎంఐఎంతో పొత్తు… ఆపై అక్బరుద్దీన్ కారు కేసీఆర్‌దే అయినా స్టీరింగ్ తమ కంట్రోల్‌లోనే ఉంటుందంటూ అన్న మాటలు.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను దెబ్బతీశాయి. హిందుత్వ నినాదమే.. పార్టీలకు శరణ్యమనేంతగా మారింది. చివరకు ఏపీలోనూ బొట్లుపెట్టి.. దేవాలయాల్లో పొర్లు దండాలు పెట్టాల్సి వస్తోంది. అటువంది.. ఎమ్మెల్యే ఇలాంటి సున్నితమైన అంశంపై చేసిన కామెంట్స్ పార్టీను ఇబ్బంది గురిచేస్తాయని కేటీఆర్ సదరు ఎమ్మెల్యేను మందలించినట్టుగా తెలుస్తోంది. కొద్దినెలల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే అక్కడ పరిస్థితులు సరిగాలేవు. ఇటువంటి సమయంలో మత, ఆధ్యాత్మిక అంశాలను లేవనెత్తటం అసలుకే మోసం తెస్తుందనే ఆందోళన కూడా గులాబీ గూటిలో నెలకొందట.