హమ్మయ్య ఎలాగైతేనేం.. కవితను గెలిపించుకున్నాం. ఇప్పుడు మంత్రిని చేయటమే మిగిలింది. నిజమే.. నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలుపు ఖాయమనుకుని.. ఓడిన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత రెండేళ్లుగా పవర్‌కు దూరంగా జరిగారు. బతుకమ్మ సందడి మొదలయ్యే వేళ కవితక్క ఉంటేనే హంగామా అనేంతగా చేరువయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా దేశ, విదేశాల్లో బతుకమ్మను ఇంటింటికీ పరిచయం చేసిన మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా గెలిచారు. నిజామాబాద్ స్థానిక ఎన్నికల బరిలో బీజేపీ,టీఆర్ ఎస్ , కాంగ్రెస్ గట్టిగానే పోటీపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికసీట్లు గెలుపొందింది. దీనికి బలం చేకూరేలా హస్తం, కమలం పార్టీలోని కొందరు లోకల్ ప్రజాప్రతినిధులు కూడా కారు గుర్తుకే ఓటేశారనే అనుమానాలు లేకపోలేదు. ఫలితంగా రెండు జాతీయపార్టీలు ఘోరంగా ఓడాయి. పచ్చిగా చెప్పాలంటే ఇరు పార్టీలు డిపాజిట్ కూడా సాధించలేకపోయాయి. టీఆర్ ఎస్ 728, బీజేపీ 56, హస్తం 29 పార్టీలు కాగా.. చెల్లని ఓట్లు 10 వరకూ ఉన్నాయి. టీఆర్ ఎస్ సాధించిన ఈ గెలుపు రాబోయే దుబ్బాక ఉప ఎన్నికకు రిఫరెండంగా భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే దూకుడుతో కారు దూసుకెళ్తుందంటున్నారు టీఆర్ ఎస్ శ్రేణులు.
ఇంతవరకూ బాగానే ఉంది.. మరి కవితక్కకు ఏ మంత్రి పదవి దక్కుతుందనేది ఇప్పటికే టీఆర్ ఎస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత పార్లమెంట్‌లో అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు. కేసీఆర్ వారసురాలిగా ఢిల్లీలోనూ తెలంగాణ గొంతుకు వినిపించారు. మాటతీరులోనూ తనదైన శైలి కొనసాగించారు. కానీ.. 2018 ముందస్తు ఎన్నికల్లో
ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావించారు. కానీ అదీ కుదర్లేదు. ఆ తరువాత హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ పోటీపడాలనుకున్నా పార్టీ ఎందుకో అంగీకరించలేదట. ఎంత ఎంపీగా ఉన్నా ఆశించిన ప్రయోజనం లేదనేది కవిత అభిప్రాయమట. అందుకే.. రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూనే కీలకంగా మారాలనేది ఆమె అంతరంగంగా విశ్లేషకులు చెబుతుంటారు. పైగా తండ్రి కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేయాలనే కోరిక ఉందనేది కూడా తెలుస్తోంది. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరే సమయం వచ్చింది. ఎమ్మెల్సీగా బరిలో దిగి గెలిచిన ఆమె కు ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై పార్టీలో వ్యతిరేకత మొదలైంది. ఆ జాబితాలో నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. కవితకు కేబినెట్‌లో బెర్త్ ఇవ్వాలంటే ఎవరి అమాత్య పదవికి ఎసరు వస్తుందనే గుబులు కూడా కొందరు మంత్రుల్లో మొదలైందట. మరి ఆ మంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.