కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు మొదలయ్యాయి. టీటీడీ పాలకమండలి సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల కమిటీ భేటీ జరిగింది . ఆదివారం చంద్రగిరి సమీపం నర్సింగాపురం టీటీడీ ఆయుర్వేద ఫార్మశీ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బదిరి నారాయణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబు, టెక్నికల్ సూపర్ వైజర్ నారప రెడ్డి తో కలిసి సమీక్షించారు. ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన పరికరాలు, స్థల పరిశీలన, వన మూలికలు నిల్వలు అంశాలపై పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియా తో మాట్లాడారు. ఆనందయ్య మందుకు ఆయుష్ కమిషన్, ఐసీఎంఆర్ నుంచి కావచ్చు.. మరే ఇతర పరిశోధనా సంస్థలు నుంచైనా ఆమోద ముద్ర లభిస్తే ఆ మందు తయారీ విధానంలో టీటీడీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అనందయ్య మందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్దారణ అయిందని పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆయుర్వేద మందును స్వయంగా 60 రోజుల్లో తయారు చేసి యావత్తు రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు. అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందన్నారు. అనందయ్య ఆయుర్వేద మందు తయారీకి వినియోగించే వన మూలికలు శేషాచల అడవిలో సమృద్దిగా ఉన్నాయని తెలిపారు. ఈ మందుపై నాలుగు దశల్లో లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనాకు శాశ్వత విరుగుడు కాదన్నారు. ఇమ్యునిటీని అధికం చేయగల సత్తా ఉందని తెలిసినా..!! ఇమ్మ్యూనిటి బూస్టర్ కింద తయారీని చేపడతామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఆయుర్వేద మందు తయారీ, పంపిణీలో సీఎం సూచనల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం టీటీడీ ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ మురళీ కృష్ణ మాట్లాడుతూ..
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీకి 18 రకాల వనమూలికలు వినియోగించారని పేర్కొన్నారు. ఈ వనమూలికలు వినియోగం శతాబ్దాల కాలంగా సాగుతోందన్నారు. ప్రతి మూలిక ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేదిగా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పొందపరిచారని తెలిపారు. అన్ని మూలికలు కలగలిపిన మిశ్రమం ఆరోగ్యకరమైనదా.. కాదా అని నిర్దారణ కావాల్సి ఉందన్నారు. కేంద్ర ఆయుర్వేద పరిశోధన విభాగం ఆనందయ్య మందు అధ్యయనం లో ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ఆయుర్వేద కళాశాల ను భాగస్వామ్యం చేసినట్లు వివరించారు. ఆనంద య్య ఆయుర్వేద మందులు కంటికి వినియోగించే డ్రాప్స్ ఎటువంటి ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు. అందులో ముళ్ళ వంకాయ గుజ్జు, తోకజీలకర్ర, తేనె తో కలగలిపిన మిశ్రమం తో తయారు చేసిన డ్రాప్స్ కంటికి ఎటువంటి హాని కలగదని చెప్పారు. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అంజన ప్రక్రియ విధానాన్ని ఉదహరించారు.