ఒక కాకి చనిపోతే వంద కాకులు చేరతాయి. కానీ.. ఇక్కడ కాపాడాల్సిన ఖాకీలే లాఠీ పెత్తనంతో పెచ్చుమీరుతున్నాయి. పాలకుల ఆదేశాలు దిక్కరించి తమ సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకుని చట్టాలను అమలు చేస్తున్నారు. అది ఏపీ, యూపీ ఏదైనా కావచ్చు. చేతిలో ఉన్న అధికారాన్ని సామాన్యులపై ప్రదర్శించటమే వారికి తెలిసింది. ఈ క్షుద్రరాజకీయాల్లో అమాయకులే బలిపశువులు. ఏ జెండా మోయని భుజాలు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఏ నాయకుడిని నెత్తిన పెట్టుకోని పాపం ఇంటిల్లిపాదీ అనుభవించాల్సి వస్తోంది. భార్య , ఇద్దరు పిల్లలతో హాయిగా సాగే అబ్దుల్‌సలాం కుటుంబం అర్ధాంతరంగా జీవితాలకు ముగింపు నివ్వటమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి తప్పులు చేసినవారిని వదలబోమంటూ హెచ్చరిక చేసినట్టయింది. రాజకీయాలకు అతీతంగా ఘటనకు కారకులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. నిందితులిద్దరూ బెయిల్‌పై వచ్చారు. బెయిల్ రద్దుకు పోలీసులు కూడా పిటీషన్ దాఖలు చేశారు. అంత వరకూ బాగానే ఉంది. టీడీపీ హయాంలో ఓ వైద్యవిద్యార్ధిని కూడా ఇదే విధంగా లైంగికవేధింపులకు బలైంది. సుగాలి యువతి కూడా నరకాన్ని చవిచూసి కన్నుమూసింది. ఇలా.. పాలకులు మారినా దారుణాలు తగ్గకపోవటం వెనుక తప్పిదం.. పాలకులదా! పాలకుల అడుగులకు మడుగులు ఒత్తులూ పెత్తనం చెలాయించే యంత్రాంగానిదా! దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయపార్టీలదే.
నంద్యాలలో పోలీసుల వేధింపులు భరించలేక.. మానసికంగా.. శారీరకంగా ఎదురైన నరకాన్ని చవిచూడలేక కుటుంబంతో కలసి ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌సలాం మరణాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవటం చూస్తుంటేనే బాధేస్తుంది. ఏ పార్టీ అయినా ఏ సర్కారైనా.. దీన్ని ఖండించాల్సిందే. దీని వెనుక ఎవరున్నా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అనేది సగటు మనిషి అంతరంగం. పాతికేళ్లపాటు పనిచేసిన బంగారు దుకాణం యజమాని దొంగ అని ముద్రవేస్తే అబ్దుల్‌సలాం ఎంతగా విలవిల్లాడిపోయి ఉంటాడో. అది నిజమో.. అబద్దమో .. కావాలని అతడిని ఇరికించేందుకు ఎవరైనా నాటకమాడారా! దొంగచాటున కొన్న బంగారాన్ని దుకాణ యజమానులు కొందరు కావాలనే తమ వద్ద పనిచేసే సిబ్బంది ఇళ్లలో భద్రపరచటం పోలీసులకు మాత్రం తెలియనదా! అక్కడ ఏం జరిగిందనేది పోలీసులకే తెలియాలి. కానీ.. దొంగగా ముద్రపడిన సలాం.. ఆటో కొనుక్కొని కుటుంబాన్నినెట్టుకొస్తున్నాడు. అక్కడా పోలీసులు కంటి నుంచి తప్పించుకోలేకపోయాడు. రూ.70వేల నగదు పోయాయంటూ సలాంపై అనుమానం వ్యక్తంచేయగానే పోలీసులు వచ్చివాలిపోయారు. తమదైన మార్క్‌తో ఎంతటి వేదనకు గురిచేసి ఉంటారనేది తెలియకనే తెలుస్తుంది. కష్టాలను.. పస్తులను.. ఆర్ధిక ఇబ్బందులను అనుభవించిన సగటు మధ్యతరగతి వ్యక్తి సలాం ఎంతటి మనోక్షోభకు గురై ఉంటాడో.. దొంగ.. దొర అనేది పక్కనబెడితే.. అతడూ ఒక మనిషేననే సంగతి మరచి విచక్షణ మరచి దారుణంగా ప్రవర్తించిన పోలీసులదనేది అభియోగం. మరి పోలీసులపై అంతటి ఒత్తిడి తెచ్చిన ఖద్దరు నేతలను వదిలేస్తారా! అనే ప్రశ్న కూడా మొదలైంది. కళ్లెదుట ఇంతటి ఘోరం జరిగినా పలు పార్టీలు.. రాజకీయ నాయకులు ఇక్కడ కూడా రాజకీయాలు చేయాలనే చూస్తున్నారు. దీన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి.