రోజులుమారాయి.. సినిమా విడుదలైన బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో.. ఒక రిక్షావాడు ముత్తయిదవను తన బండిలో కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కుతున్నాడు. ఆ అమ్మ చెప్పేమాటలు వింటూ అలసట కూడా మరచిపోయాడట. ఆమె దింపమన్న చోట వదిలేసి ఇంటిముఖం పట్టాడు. రిక్షా సీటు కింద తినేందుకు తెచ్చుకున్న సద్దెన్నం మూట తీయబోయాడు. అంతే రెప్పపాటులో అక్కడ కనిపించిన బంగారు నాణేలు చూసి విస్తుపోయాడు. పేదరికం నుంచి బయటపడేందుకు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఇచ్చిన బహుమతిగా మురిసిపోయాడు. ఇది కల్పితమా. నిజమా అనే తార్కికాన్ని వదిలేస్తే.. అమ్మవారిపై భక్తుల నమ్మకం అంత గొప్పది. ఆ తల్లి దీవెనల కోసం దేశనలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. అదే ప్రాంతంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తప్పస్సు చేశాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.
విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన కనకదుర్గమ్మ భక్తుల పాలిట కొంగుబంగారం. ఇరవై ఏళ్ల క్రితం అక్కడ ఎటువంటి రాజకీయాలకు తావుండేది కాదు. కానీ.. 2014కు ముందు నుంచి ఆలయ ఆదాయంపై కన్నేసిన రాజకీయ నేతలు లాభార్జనకు కొండను అనువుగా మలచుకోవటం ప్రారంభించారు. అధికార పార్టీ నేతలు మరింత పేట్రేగి పోవటం కూడా ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ అధికారిగా తమకు అనువైన కుల, రాజకీయ ప్రాభల్యం ఉన్న వ్యక్తులను నియమించుకుంటున్నారు. మొన్నటి టీడీపీ హయాంలోనూ అక్కడ పాలకమండలి, ఈవో తీరుపై పలు విమర్శలు వచ్చాయి. భక్తులను వెనక్కినెట్టేసి కేవలం వీఐపీలకే అధికారులు పొర్లుదండాలు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరెలను కూడా.. పాలకమండలిలోని సభ్యులు ఇంటికి తీసుకెళ్తున్నారనే గుసగుసలూ లేకపోలేదు. గతేడాది జులైలో అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు చేశారనే వార్త కలకలం రేకెత్తించింది. అర్ధరాత్రి వేళ పురోహితుడు గుడిలోకి వెళ్లిరావటం కూడా సీసీ కెమెరాల్లో గుర్తించారు. కృష్ణపుష్కరాల సమయంలో నాటి సర్కారు ఏకంగా 40 గుళ్లు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయంటూ తొలగించి పాపం మూటగట్టుకుంది. కొబ్బరిచిప్పల దొంగలు, సైకిల్ బెల్ కొట్టేసే ముఠా నాయకులు రాజకీయాల్లోకి రావటం వల్లనే ఇదంతా జరిగిందంటూ వైసీపీ ఆనాడు విమర్శించింది.
ఇప్పుడూ అదే కనకదుర్గమ్మ వారి దేవాలయం.. పాలకులు మాత్రమే మారారు. మళ్లీ అదే నిర్లక్ష్యం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అవే చర్యలు. అమ్మవారి కోసం లక్షలు వెచ్చించి రూపుదిద్దుకున్న నాలుగు వెండి సింహాల ప్రతిమల్లో మూడు మాయమయ్యాయి. ఈ ఏడాది ఉగాది సమయంలో వాటిని చూశామంటూ కొందరు చెబుతున్నారు. అబ్బే అవన్నీ ఎక్కడో పడేసి ఉంటారు. కాదుకాదు.. వెండి వస్తువులు కదా! శుభ్రం చేయటానికి వచ్చి ఉంటారంటూ ఆలయ అధికారులు పొంతనలేని మాటలతో దీన్ని మరింతగా రచ్చచేశారు. అసలే జగన్ ప్రభుత్వం అంటే హిందు వ్యతిరేకి అనే నినాదాలు.. తరచూ ఆలయాల్లో జరుగుతున్న ఘటనలో వేడెక్కిన హిందూ సంఘాలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇంతకీ.. ఆ విగ్రహాలు ఏమయ్యాయంటే.. సమాధానం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా.. మరొకరు ఎలా జోక్యం చేసుకుంటారనే అనుమానం కూడా లేకపోలేదు. మరో విశేషమేమిటంటే.. ఏ పార్టీ అధికారంలో ఉన్న అమ్మవారి గుడిలో పాలకమండలి వర్సెస్ ఈవో మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకర్ని ఇరికించాలని మరొకరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అంతర్గత గొడవల్లో భాగం కావచ్చనేది బెజవాడ వాసుల అనుమానం.