విశాఖపట్టణం.. అద్భుతమైన ప్రాంతం. ప్రకృతి సిద్ధమైన రమణీయత. అక్కడి ప్రజలు కూడా శాంతికాముకులు. చరిత్ర పరిశోధకులు, పర్యావరణ వేత్తలకు అదో తరగని గని. కానీ.. 2014 తరువాత అక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల మించిన రాజకీయాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఓటమి వైసీపీను మరింత కుంగదీసింది. తల్లినే గెలిపించుకోలేకపోయాడనే విమర్శలు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డిని మరింత బాధపెట్టాయి. టీడీపీ కంచుకోటగా విశాఖను మరింత పటిష్ఠం చేసుకునేందుకు టీడీపీ అవకాశం దక్కించుకుంది. 2019లో పరిస్థితులు బిన్నంగా మారాయి. అధికశాతం విశాఖ ప్రజలు వైసీపీ వైపు మళ్లారు. జగన్ అనుకున్నది సాధించారు. వాస్తవానికి 2014 తరువాత టీడీపీ కూడా విశాఖను ఆర్ధికరాజధానిగా ప్రమోట్ చేసింది. కంపెనీలను కూడా అక్కడే ప్రారంభిస్తామంటూ చెప్పింది. సినిమా షూటింగ్‌లు, స్టూడియోలకు అదే అనువైన ప్రాంతమంటూ సినీపరిశ్రమ పెద్దలు కూడా అంగీకరించారు. జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక.. మూడు రాజధానులు తెరమీదకు తీసుకురావటం.. విశాఖను ప్రధానంగా చెప్పటంతో అమరావతి రాజధాని తరలింపు ఖరారైంది. దీంతో అక్కడి రైతులు.. తాము ఇచ్చిన 34,000 ఎకరాల భూమి సంగతి ఏమిటంటూ ప్రశ్నించారు. దాదాపు 250 రోజులుగా దీక్ష చేస్తున్నారు. నిజానికి ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ బాగానే ఉన్నా.. రాజధానుల పేరిట వాటిని వేరు చేయటం ఏపీ ప్రజలను విభజిస్తున్నారనే భావన పెరిగింది.
రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోనిది అంటూ. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు చేతులు దులుపుకుంది. ఆ నాడే వేలకోట్లు ఇచ్చామంటూ మీ ఇష్టం మీ రాజధాని అంటూ వదిలేసింది. ఇదే విషయం కోర్టుకూ అందజేశారు. మొన్న గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు.. ఏపీ రాజధానిగా అమరావతిని భారతదేశ చిత్రపటంలో ఉంచామంటూ మంత్రి వర్యులు సెలవిచ్చారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తుండటంతో రాజధాని అంశంపై అందరూ మౌనం వహిస్తున్నారు. జగన్ సర్కారు మాత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే.. విశాఖ గురించి గతానికి భిన్నంగా చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బౌగోళికంగా విశాఖ పట్టణం రాజదానిగా వద్దంటూ ఓ వర్గం ప్రచారం ప్రారంభించింది. గతంలో అమరావతి పేరు వచ్చినపుడు అప్పటి వ్యతిరేక వర్గం.. అబ్బే కృష్ణానదికి వరదలు వస్తాయి. కొండవీడు వాగు పొంగుతుందంటూ ప్రకృతి వైపరీత్యాలను బూచిగా చూపారు. ఇప్పుడు.. విశాఖ రాజదాని అనగానే బౌద్దం పాడవుతుంది.. బౌద్దమతం విలసిల్లిన కొండలు చెదిరిపోతాయని.. సముద్రం దగ్గరగా ఉండటం వల్ల తరూ తుఫాన్లు, సునామీల బెడద ఉంటుందంటూ మరో వాదన. ఇలా.. రాజదాని ఫలానా చోట అనగానే నచ్చని పార్టీలు, వర్గాలు.. ఇలా విషప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయనేది సామాన్యుడి బాద. 2024లో వైసీపీ విపక్షంలోకి చేరి.. మరో పార్టీ అధికారంలోకి వచ్చి రాజదాని మార్పు అంటూ మరో ప్రాంతానికి మార్చితే ఏపీ జనం ఏం చేయాలనే ప్రశ్నకు.. అన్ని రాజకీయపక్షాలు సమాధానం చెప్పాల్సి ఉంది.



