కొట్టడం అంటే అట్టా ఇట్టా కాదు. గురిచూసి కొట్టాలి. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి. ఏదో సైలెంట్ గా ఉన్నాడు. బుద్దిగా పాలన చేసుకుంటున్నాడు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తుంటే మౌనం వహిస్తున్నాడు. అదనుచూసి కొడతాడనే విషయాన్ని ప్రత్యర్థులు ఊహించలేకపోయారు. పక్కా సాక్ష్యాలు.. ఎవ్వరూ కిమ్మనకుండా ఉండేటా సరైన ఏర్పాట్లతో కొట్టాడు. అంతే.. దెబ్బకు దెయ్యం దిగినట్టుగా పసుపు తమ్ముళ్లు దిక్కులు చూస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు చేసిన ఫిర్యాదు ఎవ్వరూ ఊహించి ఉండరు. నిన్నటి వరకూ అమరావతి రాజధానిపై తాను చేసిన కామెంట్స్ నిజమనేలా ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు బాట వేశారు. ఏపీను కేవలం కమ్మ సామాజికవర్గంలోని కొందరు ఎలా దోచుకున్నదీ.. దీనికి ప్రతిష్టాత్మకరమైన జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉపయోగపడిందనే వివరాలను ఇవిగో చూడమంటూ సుప్రీం ముందు పెట్టడం అంత ఆషామాషీ కాదు. పైగా 20కు పైగా సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం జాతీయస్థాయిలోనే సంచలనం. పైగా ఏడాదిన్నర పాలనలో హైకోర్టు 70 సార్లు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశాన్ని.. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా చేసిన చట్టాలను కూడా న్యాయస్థానం ఎంత తేలికగా తీసుకుందనేది కూడా సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు.
ఇదంతా అంటుకట్టినట్టు.. అందంగా అమర్చినట్టుగా అదను చూసి కొట్టడమే ఇక్కడ ప్రత్యేకత. హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు.. ప్రత్యర్థులకు అనుకూలంగా స్టేలు రావటంపై పలు అనుమానాలున్నాయి. కానీ న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవం.. భయం .. వైసీపీ తరపున సరైన న్యాయనిపుణులు లేకపోవటం కారణాలేమైనా.. ఇది వైసీపీ సర్కారును ఇరుకున పెట్టడమే కాదు.. పరువు పోయేంతగా మార్చేసింది. తాజాగా హైకోర్టుపై వైసీపీ నేతలు అమంచి కృష్ణమోహన్, తమ్మినేని వీరభద్రం, నందిగం సురేష్ వంటి వైసీపీ ప్రజాప్రతినిధులు మరికొందరు చేసిన కామెంట్స్‌పై కేసు నమోదు చేయకపోవటాన్ని తప్పుబట్టింది. ఒక వేళ హైకోర్టులో ఏదైనా తప్పు జరిగితే.. దాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించే అవకాశం ఉందని కూడా చెప్పింది. అంతేగానీ జ్యుడిషియరీ వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవాలనేంతగా వైసీపీ నేతలు చెలరేగటంపై కూడా హెచ్చరించింది.
దీనికోసమే ఎదురుచూస్తున్న వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు హైకోర్టులో తమకు ఎదురైన అనుభవాలకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రోధ్బలమే కారణమంటూ ఏకంగా లేఖరాశారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ బట్టబయలు చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన ఎన్.వి.రమణ, దమ్మాలపాటి ఎప్పటి నుంచో చంద్రబాబుకు ప్రియమిత్రులు. ఎన్.వి.రమణ, దమ్మాలపాటి ఇద్దరూ గతంలో నందిగామ నియోజకవర్గం టీడీపీ సీటు ఆశించారు. కానీ.. బాబుగారు పుణ్యామంటూ వారిని జ్యుడిషియరీ వ్యవస్థలోనే ఉంచి అమాంతం పెంచేసి ఉన్నతస్థాయికి చేర్చారనే అభియోగాలు లేకపోలేదు. వీళ్లంతా టీడీపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయవ్యవస్థను బాబు చెప్పినట్టుగా నడిపిస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. దానికి ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు. అచ్చెన్నాయుడు, డాక్టర్ రమేష్, అమరావతి రాజధాని కేసులను ఉదాహరణగా చూపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న ఎన్.వి.రమణకు ఇది ఊహించని షాక్. మరి దీన్నుంచి బయటపడి.. ఆ స్థానం చేరేందుకు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
హైకోర్టులో జడ్జిలుగా ఉన్న వారి పుట్టుపూర్వోత్తరాలు.. వారిలోని న్యాయ పరిజ్ఞానం. వంటివి ఏకరవుపెట్టి మరీ సాక్షి పత్రిక చూపెట్టింది. ఇదంతా జగన్ పక్కా వ్యూహంతో వేసిన అడుగులు గానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్ల ఏలుబడిలో చంద్రబాబు కేవలం ఒకే వర్గానికి కొమ్ముకాసిన విషయం చెబుతూనే.. ఎప్పటి నుంచో ప్రబలంగా నాటుకుపోయిన జ్యుడిషియరీను బాబు ఎలా మేనేజ్ చేస్తున్నారనేది కూడా కళ్లకు కట్టారు. ఇదంతా ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం కావటంతో.. ప్రధాని నరేంద్రమోదీ నుంచి అవసరమైన ఆశీర్వచనాలు జగన్‌కు పుష్కలంగా ఉన్నాయనేది దీన్ని బట్టి అర్దమవుతుందంటారు.. వైసీపీ నేతలు.