తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై ఉత్కంఠత మొదలైంది. ఇటీవల అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బుల్లి దుర్గాప్రసాద్ మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ వైసీపీ తరపున ఏకగ్రీవం చేయాలనే ప్రతిపాదనకు అన్నిపార్టీలు ప్రతికూలంగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ అభ్యర్ధిగా ఖరారైనట్టుగానే ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ప్రకటించారు. ఎలాగైనా సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలనే ప్రణాళికతో చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నట్టుగానే సంకేతాలు పంపారు. చిత్తూరులో మళ్లీ టీడీపీ పునర్వైభవం సాధించాలంటే తిరుపతి ఉప ఎన్నిక గెలుపు టీడీపీకు అత్యవసరంగా మారింది. బీజేపీ, జనసేన కూడా ఈ దఫా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మంగళగిరిలో జరుగుతున్న జనసేన సమావేశాల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మిగిలింది.. వైసీపీ.. దుర్గాప్రసాద్ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరో వైపు ఆశవహుల జాబితా కూడా చాంతాడంత ఉండటంతో అక్కడ గెలిచే అభ్యర్ధికే టికెట్ కేటాయించాలనేది పార్టీ అంతర్గత అభిప్రాయమట. అయితే.. తాజాగా తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో రామలింగారెడ్డి సతీమణి సుజాత ఓటమి వైసీపీను ఆలోచనలోకి నెట్టేసింది. కేసీఆర్ పట్ల అంతటి అభిమానం ఉన్న తెలంగాణ ప్రజలు కూడా వారసత్వాన్ని విస్మరించటం.. నాయకత్వానికే ఓటేయటంతో వైసీపీ శ్రేణులు మీమాంశలో పడ్డాయట. తిరుపతి ఎంపీ స్థానం తిరిగి దక్కించుకోవటం వైసీపీ ఎదుట పెనుసవాల్. ఏ మాత్రం తేడాలొచ్చినా 2024 ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాబట్టి.. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అన్ని సమీకరణలు పక్కాగా పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకోనున్నారట. బీజేపీ, జనసేన కూడా.. 2019లో ఎదురైన పరాజయానికి సమాధానం చెప్పేందుకు 2021లో జరిగే తిరుపతి ఉప ఎన్నికలను వేదికగా మలచుకోవాలనే యోచనలో ఉన్నాయి.