కరోనా సైలెంట్‌గా విస్తరిస్తోంది. నవంబరులో సెకండ్ వేవ్ ఉంటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి బారత్‌లో కొవిడ్19 పాజిటివ్ కేసులు 90,000 నుంచి 60,000 తగ్గుతూ రావటంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ.. రాబోయే శీతాకాలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. అమెరికా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి చెందే సమయంలో అక్కడ శీతాకాలం. ఇండియాలో వేసవి కాలం కావటంతో తీవ్రత తగ్గింది. విదేశాల్లో లక్షల్లో కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన మనకు రాబోయేది చాలా గడ్డుకాలం అంటున్నారు. కొవిడ్ భారిన పడిన వారిలో కొందరిలో యాంటీబాడీస్ తయారు గాకపోవటం ఆందోళన కలిగిస్తుంది. యాంటీబాడీస్ వచ్చినా అవి కేవలం 2-3 నెలల మాత్రమే ఉంటున్నాయి. మరోసారి వైరస్ ఎటాక్ అయినా లోపల ఉన్న యాంటీబాడీస్ మేల్కొంటాయని సీసీఎంబీ అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ విదేశీ శాస్త్రవేత్తలు మాత్రం వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించే ప్రతిసారీ కొత్త రూపం సంతరించుకుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. వీటిలో ఏది నిజమనేది చెప్పటం కూడా శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. రష్యా రెండో టీకాను తయారు చేసేపనిలో నిమగ్నమైంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు భారత్ అనుమతినిచ్చింది. అయితే కొన్నిచోట్ల టీకా ఫలితాలు నెగిటివ్‌గా ఉండటంతో పునరాలోచనలో పడ్డారు.
ఇండియాలో కరోనా టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ క్లీనికల్ ట్రయల్స్ రెండో దశ విజయవంతంగా పూర్తిచేశారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళసై భారత్ బయోటెక్ ల్యాబ్ ను సందర్శించారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ పక్కా అంటూ ధీమా వ్యక్తంచేశారు. పలు దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసే భారత్ బయోటెక్‌కు ఇది చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. దీంతో ఎక్కడ తమ ప్రాభవానికి దెబ్బతగలకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా 130 కోట్ల మందికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు విదేశీ సంస్థలతోనూ మంతనాలు సాగిస్తుంది. అయితే. టీకా ద్వారా శరీరంలోకివచ్చే యాంటీబాడీస్ ఎన్నాళ్లు ఉంటాయనే అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ప్రపంచంలో సుమారు 850 కోట్ల మంది జనాభా ఉంటే.. 1000 కోట్ల వరకూ సిరంజిలు కావాలని అంచనా. భారత్‌లో అయితే.. సుమారు 300 కోట్ల వరకూ సిరంజిలు ఇప్పటికిప్పుడు అవసరం. మరి ఇంత పెద్దమొత్తంలో తయారు చేసేందుకు సామాగ్రి ఎంత వరకూ ఉంది. ఫార్మారంగం ఎంత సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఎంత వరకూ ప్రోత్సాహం లభిస్తుందనేది కాలమే నిర్ణయించాలి.
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం.. కరోనా టీకా ప్రతి ఆరు నెలలకోసారి తీసుకోవాలంటున్నారు వైద్యనిపుణులు. ఒక్కో టీకా రూ.1000-1500 వరకూ ధర పలికినా.. లక్షల కోట్లరూపాయలు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్‌తో యుద్ధసన్నాహాలతో కోట్లాదిరూపాయలు ఆయుధాగారం బలం కోసం వెచ్చిస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే.. టీకా వచ్చినా కోట్ల మందికి ఇచ్చేందుకు అవసరమైన సిరంజిలు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడున్న ప్రధాన సమస్య. నిజమే.. టీకా వచ్చినా.. దాన్ని మనుషుల్లోకి ఎక్కించాలంటే సిరంజి కావాలి. ఆ సమయానికి అవి సరిపడినంత లేకపోతే.. కొత్త సమస్య మొదలైనట్టే. కాబట్టి టీకాతోపాటుగా.. సిరంజీల తయారుకు ప్రభుత్వాలు ముందుగానే చర్యలు చేపట్టాలనేది శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల సూచన.