జీహెచ్ ఎంసీ మేయ‌‌ర్ పీఠం రెడ్ల‌కా. బీసీల‌కా!

మేమే స్వ‌యంగా మేయ‌ర్ పీఠం సాధిస్తాం. అస‌లు 45 సీట్లు వ‌స్తే చాలు.. ఎక్స్ అఫిషియో ఓట్ల‌తో మాదే అధికారం.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్ మంత్రుల ధీమా. కానీ.. ఫ‌లితాలు ఊహించ‌ని విధంగా ఝ‌ల‌క్ ఇచ్చాయి. కేసీఆర్ ను తిరుగులేని నేత‌గా.. రాబోయే రోజుల్లో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌బోతున్న గులాబీబాస్‌గా ఆకాశానికి ఎత్తేసిన గులాబీ శ్రేణులు రేకులు వాడిపోయాయి. ఇప్పుడు మేయ‌ర్ పీఠం కోసం ఎవ‌రో ఒక‌రు ఆదుకోవాలి. కాదంటే.. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లో ఆరునెల‌ల త‌రువాత మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. అప్ప‌టికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది అదో భ‌యం. ఏమైనా.. ఇప్పుడు పీఠం సాధించ‌వ‌లె. కాదంటే.. ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దు. ఇప్ప‌టికే మొన్న జీహెచ్ ఎంసీ ప్ర‌చారంలో పాల్గొన్న ఈట‌ల రాజేంద్ర‌, శ్రీనివాస్‌గౌడ్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, గంగుల ప్ర‌భాక‌ర్‌ల‌కు తిరుగులేని దెబ్బ త‌గిలింది. ఆ న‌లుగురు ప్రాతినిధ్యం వ‌హించిన డివిజ‌న్ల‌లో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేక‌పోయింది. ఇది చాల‌ద‌న్న‌ట్టుగా..

క‌విత ప్ర‌చారం చేసిన ముషీరాబాద్‌లోనూ కాషాయ జెండా ఎగిరింది. ఎల్ బీన‌గ‌ర్‌లో హ‌స్తం నుంచి టీఆర్ ఎస్‌లోకి చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇలాఖాలో 11 డివిజ‌న్లూ బీజేపీ గాలిలో కొట్టుకుపోయాయి. ఉప్ప‌ల్‌లో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య ఘోరంగా ఓడింది. మేయ‌ర్ భార్య శ్రీదేవి గెలిచి ప‌రువు నిలిపింది. ఇప్పుడు మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ఇవ్వాలి. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే.. చెరో రెండున్న‌రేళ్లంటూ వాటాలు వేసుకోవాలి. అప్పుడు బీజేపీ ఆరోపించిన‌ట్టుగానే ఎంఐఎం, టీఆర్ ఎస్ ఒక్క‌టే అనేది రుజువు అవుతుంది. ఇది రేప‌టి ఎన్నిక‌ల్లో కేసీఆర్ కోట‌రీకు హిందువుల ఓట్ల‌ను దూరం చేస్తుంద‌నే భ‌యం ఉంది. కాబ‌ట్టి మేయర్ పీఠం టీఆర్ ఎస్ అభ్య‌ర్థికే ఇవ్వాలి. అయితే.. అది రెడ్డి, బీసీ ఏ వ‌ర్గానికి కేటాయించాల‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ ప‌ట్ల రెడ్లు వ్య‌తిరేకంగా ఉన్నారు. పోనీ.. బీసీల‌కు ఇద్దామంటే.. ఎవ‌రికి ఇవ్వాల‌నేది అదో ప్ర‌శ్న‌.. అయితే.. ప్ర‌స్తుతం మేయ‌ర్ పీఠంపై ఆశ‌ప‌డుతున్న వారిలో విజ‌యారెడ్డి, గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, బొంతు శ్రీదేవి, మ‌న్నె క‌వితారెడ్డి, సింధురెడ్డి, కొంద‌రు మైనార్టీ అభ్య‌ర్థినుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సింధురెడ్డి, మ‌న్నెక‌వితారెడ్డి వీరిద్ద‌రిలో ఒక‌రికి టీఆర్ ఎస్ మేయ‌ర్ పీఠం క‌ట్టబెట్ట‌వ‌చ్చ‌నే ఊహ‌గానాలున్నాయి. ఇద్ద‌రికీ పార్టీ పెద్ద‌ల వ‌ద్ద ప‌లుకుబ‌డి ఉండ‌టంతో.. రెడ్డి వ‌ర్గ మ‌హిళ‌ల‌కే మేయ‌ర్ సీటు ఖాయ‌మ‌నేది ఇప్ప‌టికి ఉన్న స‌మాచారం. ఎంఐఎం ఏదైనా పేచీ పెడితే త‌ప్ప‌.. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు మేయ‌ర్ అయిన‌ట్టే లెక్క అంటూ.. క‌వితారెడ్డి, సింధురెడ్డి అనుచ‌రులు లెక్క‌లు క‌డుతున్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here