ఉచితంగా ప్రచారం రావాలంటే ఏం చేయాలి.. అప్పనంగా సెలిబ్రిటీ కావాలంటే ఎలా! అబ్బే.. దీనికెందుకు ఆలోచన.. మెగాఫ్యామిలీలో ఎవరో ఒకర్ని బజారుకు ఈడ్చటమే అనేంతగా మారింది పరిస్థితి. ఇది మా మాట కాదండోయ్.. మెగా అబిమానుల ఆవేదన. ఎందుకంటే.. ఆచార్య, పుష్ప సినిమా కథలు తమవేనంటూ వివాదం చేయటం చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి.. వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. సినీ పరిశ్రమలోనూ అందరివాడుగా గుర్తింపు ఉండనే ఉంటుంది. కానీ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి కొందరివాడుగా మారాడనే విమర్శలు మొదలయ్యాయి. పీఆర్పీను కాంగ్రెస్‌లో కలిపేయటంతో విమర్శకులకు మరింత కలిసొచ్చింది. రెండోకూతురు పెళ్లితో ఆయన్ను వివాదాల్లోకి లాగటం మొదలైంది. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు హిందుపురం శాసనసభ్యుడు బాలకృష్ణ కూడా చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలుస్తారా! అంటూ విలేకర్లు అడిగితే.. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలంటూ కాస్త మొరటుగానే సమాధానమిచ్చారు. అంతకుముందు తెలుగు సినిమా డైమండ్‌జూబ్లీ ఉత్సవాల్లోనూ చిరంజీవిని లెజెండ్ అని పిలవటంపై మోహన్‌బాబు ఘాటుగా స్పందించారు. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ గట్టగానే తగిలింది.
ఇటీవల చిరంజీవితోపాటు ఇతర నటులు తెలుగు సీఎంలతో సమావేశం కావటాన్ని బాలయ్యబాబు తప్పుబట్టారు. అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమంటూ విమర్శించారు. తనకు ఆ సమావేశాల గురించి తెలియదంటూ బాంబు పేల్చాడు. చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసిన సైరా నరసింహారెడ్డి సినిమా కథ మాదేనంటూ కొందరు నానా రగడ చేశారు. నరసింహారెడ్డి బంధువులమంటూ కొందరు చిరు ఇంటి వద్ద నిరసన కూడా తెలిపారు. ఇవి కేవలం శాంపిల్స్ మాత్రమే… గతంలో ఒక యువకుడు తాను మెగాస్టార్ కొడుకునంటూ రచ్చ చేయాలని చూశాడు. పసివాడిప్రాణంలో తానే నటించానంటూ కూడా నాటకాలాడాడు. కొమరంపులి సినిమా సమయంలోనూ.. కొమరం మాదేనంటూ కొందరు అభ్యంతరం చెప్పారు. గద్దలకొండ గణేష్ సినిమాకు ముందుగా వాల్మీకి అనే పేరు పెట్టారు. అప్పుడూ.. తమ మనో భావాలు దెబ్బతిన్నాయంటూ పేరు మార్చాలంటూ కోర్టుకెళ్లారు. జనసేనాని పవన్ పై శ్రీరెడ్డి, వర్మ, కత్తిమహేష్ వంటివాళ్లు ఎంతగా మాటల దాడి. మానసిక ఒత్తిళ్లు చేశారో అందరికీ తెలిసిందే.
తాజాగా.. చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ సినిమా ఆచార్య కథ తనదేనంటూ రచయిత రాజేష్ వాదిస్తున్నాడు. ఆ కథను బాలయ్యతో తీయాలనుకుంటున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్శంగా ఆచార్య ఎమోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అక్కడ ధర్మస్థలి అనే పేరు వినిపించగానే రాజేష్ తెరమీదకు వచ్చాడు. మైత్రీమూవీస్‌కు కథ తానే చెప్పానంటాడు. దేవుడు మాన్యాలు పెద్దల కబంధం హస్తాల్లో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం కౌలుకు ఇవ్వాలంటూ చెప్పేది కథ. మైత్రీవాళ్లకు తాను చెప్పానంటూ రాజేష్ ఆచార్య సినిమాను వివాదంలోకి లాగాడు. కానీ తన కథ వేరంటూ కొరటాల చెబుతున్నారు. తమకెవరూ ఆచార్య కథ ఎవ్వరూ చెప్పలేదంటూ మైత్రీమూవీస్ కూడా చెప్పింది. పోస్టర్‌తోనే అంచనాలు పెంచిన సినిమా పుష్ప. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందనేది అర్ధమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్నదీనిపై ఎన్నో అంచనాలున్నాయి. దీనిపై కాపీ వివాదం మొదలైంది. ప్రముఖ రచయిత గంగాధర్ వెంపల్లి పుష్ప సినిమా తన కథనే అంటాడు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై సుకుమార్ స్పందించలేదు. గంగాధర్ వెంపల్లి ఎర్రచందనంపై పలు కథలు రాశారు. తన కథలు ఆధారంగానే పుష్ప సినిమా అంటూ వివాదానికి తెరలేపారు. దీనిపై సుకుమార్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తరచూ.. ఇలా మెగాకాంపౌండ్ వివాదాల్లోకి చేరటం.. యాదృచ్ఛికమా.. కావాలని చేస్తున్న ప్రచారమా! అనేది మెగాఫ్యాన్స్ డౌట్ అట.



