వైఎస్ వారసుడిగా జగన్ మోహన్‌రెడ్డికి ఇప్పటికీ అదే జనాధరణ. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా జనం ఆదరించారు.. అభిమానం చూపి విజయం అందించారు. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మరో మూడు నాలుగు దఫాలుగా సీఎం కుర్చీలో ఉండాలనేది జగన్ పక్కా ప్లానింగ్. అయితే.. సొంతవాళ్లతో ఆయనకు తరచూ చికాకులు తప్పట్లేదు. ఇదంతా ఆయనకు తెలిసి జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. ఇసుక నుంచి మైనింగ్ వరకూ అన్నింటా వైసీపీ నాయకులు చికాకులు తెప్పిస్తున్నారు. దేవాలయాలపై దాడులు, అంతర్వేది రథం తగులబెట్టడం వంటి ఘటనలు ఓ వర్గంలో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం విక్రయానికి ఉంచటం.. ప్రత్యేకహోదా.. రాజధాని తరలింపులు.. ఎమ్మెల్యేలు, మంత్రుల అక్రమాలు, అవినీతి కూడా ఇబ్బందిగా మారింది. ఈ దఫా.. చాలా నియోజకవర్గాల్లో కొత్తవాళ్లకే ఛాన్స్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో సెకండ్ కేడర్ నేతలపై నిఘా ఉంచారు. తమ అనుమతి లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ హుకుం జారీచేశారట. ఇలాంటి సమయంలోనే అంతర్గత విబేధాలు . ఇవి చాలదన్నట్టుగా.. జడ్జిలపై దారుణంగా మాట్టాడి.. వాటిని సోషల్ మీడియాలో ఉంచిన 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 13 మందిని అరెస్ట్ చేసింది. ముగ్గురు విదేశాల్లో ఉన్నట్టు నిర్దరించింది. ఈ కేసులో ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఆధారాలు కూడా సీబీఐ సేకరిస్తుంది. జడ్జిలను తూలనాడటం, దాడులు చేయటం వంటి వాటిపై సుప్రీం న్యాయమూర్తి ఎన్ వి.వెంకటరమణ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సీబీఐ తీరుపై కూడా ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు వేగిరం చేశాయి. ఇప్పుడు ఇదే వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. సొంతవాళ్లతో ఎదురైన ఇబ్బందులు మున్ముందు ప్రజాక్షేత్రంలో ఇంకెంత తలనొప్పిగా మారతాయనే ఆందోళన కూడా ఉందట.